బొమ్మనహాల్ : నకిలీ నర్సిరీల్లో విక్రయిస్తున్న పైరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో ఆశలతో పంట సాగు చేస్తే మొక్కలు ఎండిపోతుండడం రైతుల గుండెను పిండిచేస్తోంది. బొమ్మనహాల్ మండలంలో ఇటీవల మిరప రైతులకు ఇలాంటి కష్టాలే వెంటాడుతున్నాయి. స్థానికంగా కొన్ని నర్సరీలు నకిలీ పైరును విక్రయించడంతో దానిని నాటినా ఎదుగదల లేకపోవడంతో ఎకరాకు రూ.30 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మండల పరిధిలోని బొమ్మనహాల్, కురువల్లి, చంద్రగిరి, దేవగిరి, గోవిందవాడ, బొల్లనగుడ్డం, కళ్లుదేవనహళ్లి, కృష్ణాపురం, ఎల్బీనగర్ గ్రామాలకు చెందిన రైతులు మండలంలోని ఓ ప్రయివేటు నర్సరీ నుంచి మిరప మొక్కలను కొనుగోలు చేశారు. ఒక్కో మొక్క ఒక రూపాయి ప్రకారం 16 వేల మొక్కలను కొనుగోలు చేసి మిరపను నాటారు. పైరు నాటి 20 రోజులు అవుతున్నా మొక్క ఎదగకుండా అలానే ఉండిపోయింది. తరువాత ఎండిపోయింది. దీంతో రెండోసారి మళ్లీ 16 వేల మొక్కలను తెచ్చి నాటారు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఎదుగదల కన్పిస్తోంది. దీంతో మిరప రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సరీలో నాణ్యమైన పైరును విక్రయించకుండా వ్యాపారులు మోసం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరా మిరపను నాటాలంటే 16 వేల మొక్కలు అవసరం అవుతాయి. మళ్లీ దీనికి ఎరువులు, రసాయన ముందుల పిచికారీకి అదనంగా దాదాపు రూ.30వేల వరకు డబ్బులు ఖర్చు చేయాలి. ఇంత ఖర్చు చేసినా పైరు మొక్క దశలోనే ఎండిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ పైరుతో మిరప రైతులు నష్టపోతున్నా వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. కనీసం ఎందుకు పైరు ఇలా ఎండిపోతోందన్న విషయాన్ని కూడా పరిశీలించి చెప్పే అధికారి లేరంటూ రైతులు వాపోతున్నారు. ఓ వైపు నకిలీ పైరు, మరో వైపు అధికారుల నిర్లక్ష్యంతో మిరప రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇలాంటి సమస్య తమ దృష్టికి రాలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వీడి నకిలీ పైరును విక్రయించి మోసం చేస్తున్న నర్సరీలపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.










