Mar 05,2022 22:44

సైన్స్‌ నమూనాలను పరిశీలిస్తున్న ఎంఈఓ బాబ్జి

ప్రజాశక్తి- పాకాల: మన నిత్య జీవితంలో సైన్స్‌కు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పాకాల మండల విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు. స్థానిక ఇన్ఫాంట్‌ జీసస్‌ పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితం సైన్స్‌ తో ముడి పడి ఉందన్నారు. టెక్నాలజీ బాగా పెరిగిపోయిందని, పూర్వ కాలంలో ఒక చోట నుండి ఒక చోటకు వార్తలు రావాలంటే పక్షులను ఉపయోగించే వాళ్ళని, తర్వాత ఉత్తరాలు వచ్చాయన్నారు. కానీ వార్త అందవలసిన సమయంలో అందేది కాదని, ప్రస్తుతం సెల్‌ ఫోన్లు, టాబ్‌ల వల్ల అప్పటికప్పుడే వార్త అందుతుందన్నారు. ఎంతో మంది సైన్స్‌ను అభివద్ధి చేసారని, కానీ కొంతమంది టెక్నాలజీ వినాశనానికి వాడుతున్నారని అన్నారు. టెక్నాలజీ అనేది కేవలం మానవాళికి ఉపయోగ పడేలా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్‌, ఉపాద్యాయులు సురేష్‌ బాబు, ఓబయ్య, బాలాజీ, యుగంధర్‌, శశి కుమార్‌ పాల్గొన్నారు.