సిఐటియు ఆందోళన
ప్రజాశక్తి - పాలకొల్లు
రోజురోజుకు పెరుగుతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్ విమర్శించారు. సిఐటియు మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రైస్‌మిలు వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ ప్రజలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారన్నారు. కనీసం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. కందిపప్పు రూ.130లకు పైగా ఉందని, కూరగాయల ధర కిలో వంద రూపాయలపైనే ఉన్నాయని తెలిపారు. వాటిని ప్రభుత్వాలు అరికట్టకపోవడంతో బ్లాక్ మార్కెట్‌లో వ్యాపారులు ఇష్టానుసారం రేట్లు పెంచుతున్నారన్నారు. వెంటనే పెరుగుతున్న కూరగాయల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు, రత్తయ్య, చల్లా సోమేశ్వరరావు పాల్గొన్నారు.










