Oct 21,2023 23:30

మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

* అమరవీరులకు నివాళ్లర్పించిన స్పీకర్‌, కలెక్టర్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
ప్రజల కోసం పోరాడుతూ అమరవీరులైన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యతని, నిస్వార్థ శ్రామికులుగా పోలీసులు సేవలు అందిస్తున్నారని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆధ్వర్యాన నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం శనివారం నిర్వహించారు. స్పీకర్‌తో పాటు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, జెసి ఎం.నవీన్‌, జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనాలు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ వివిధ రకాల నేరాలు పెరిగిపోతున్నాయని, నేరాల నివారణకు స్వీయ నియంత్రణ చాలా అవసరం ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు తుపాను, కరోనా కష్ట కాలంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. సమాజ రక్షణ, భద్రత కోసం పోలీసు సిబ్బంది అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారనిఅన్నారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతర పోరాటం చేస్తున్న పోలీసు సేవలు అభినందనీయమన్నారు. జిల్లా పోలీసులు ప్రకృతి వైపరీత్యాలు, ఉత్సవాలు, కోవిడ్‌ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, మావో ప్రభావిత ప్రాంతాల్లో అందించిన సేవలు మరువలేనివని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఎస్‌పి మాట్లాడుతూ విధి నిర్వహనే పరమావదిగా భావిస్తాం మేము అని అన్నారు. 1958 అక్టోబరు 21న భారత చైనా సరిహద్దుల్లో దేశంకోసం తమ ప్రాణాలర్పించిన ఆశువులు బాసిన అమరవీరులకు నివాళ్లర్పిస్తూ... పోలీసుల అమరవీరుల దినోత్సవంగా ఏటా నిర్వహించుకుంటున్నామని అన్నారు. జిల్లాలోని విధినిర్వహణలో అమరులైన ఐగురు పోలీసులు ఎస్‌.బంగారు నాయుడు, ఎ.పాపారావు, ఎం.నరేంద్రదాస్‌, ఎం.వెంకటరమణ, పి.కృష్ణమూర్తి ప్రత్యర్థి దాడుల్లో అమరులై ప్రాణాలు అర్పించారని తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు చెందిన 9 మంది విధి నిర్వహణలో వీరమరణం పొందారని, అటువంటి వారికి నివాళ్లర్పించడం మన భాధ్యత అన్నారు. జిల్లా పోలీసు శాఖ బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం జిల్లా పోలీసు శాఖ రూపొందించిన అమర వీరుల గ్రంథంలో దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన 188 అమర వీరుల పేర్లను పుస్తకాన్ని స్పీకర్‌కు ఎస్‌పి అందజేశారు. అదనపు ఎస్‌పి టి.పి.విఠలేశ్వరావు దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన 188 పేర్లు చదివి వినిపించారు. విధినిర్వహణలో అమరుల త్యాగాలు ప్రతిఫలం గుర్తుగా వారి కుటుంబాలకు ఘనంగా సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు. కార్యక్రమంలో సెబ్‌ ఎస్‌పి ఎన్‌.వి.మణికంఠ, డిఎస్‌పి వై.శృతి, డి.బాలేచంద్రారెడ్డి, జి.నాగేశ్వరరెడి, బాలరాజు పాల్గొన్నారు.