ప్రజాశక్తి - ఆచంట
జీవితాంతం ఎర్రజెండాకు అండగా నిలిచిన కడలి సూర్యారావు ధన్యజీవి అని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. సూర్యారావు సంస్మరణ సభ పండిత విల్లూరులో ఆయన నివాసం వద్ద సిపిఎం మండల కార్యదర్శి పిల్లి.ప్రసాద్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా బలరాం పాల్గొని మాట్లాడారు. సూర్యారావు సుదీర్ఘకాలం పాటు భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ ఉద్యమానికి అంకితమై నిస్వార్థ ప్రజా సేవకునిగా పనిచేశారని తెలిపారు. స్థానిక, ప్రజా సమస్యలతోపాటు వ్యవసాయ కార్మికులు, రైతు, కౌలు రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. అమర జీవులైన దిగుపాటి సాల్మన్‌రాజు, ఇది రామారావు, దిగుపాటి ప్రకాశరావు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారన్నారు. వయోభారంతో ఉన్నా సైకిల్‌పై గ్రామ గ్రామాన తిరుగుతూ పార్టీని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. అటువంటి నేత సూర్యారావు ఆకస్మిక మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. సిపిఎం మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పండిత విల్లూరులో అగ్రవర్ణాల ఆధిపత్య పోరు ఎక్కువగా ఉండేదని అయినా అలుపెరగని పోరాటంతో అత్యంత నిజాయతీపరుడుగా సూర్యారావు పనిచేసి అందరి మన్ననలూ పొందారని తెలిపారు. ఆయన ఆశయ స్ఫూర్తితో గ్రామంలోని యువతీ యువకులు ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కమ్యూనిస్టు భావాలతో సూర్యారావు ప్రజా సమస్యలను తన వద్దకు తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేశారన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. పార్టీ ఉద్యమానికి అంకితమై నిస్వార్థ ప్రజా సేవకునిగా పనిచేస్తూ ఆకస్మిక మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్, సిపిఐ ఆచంట ఏరియా కార్యదర్శి శలా పూర్ణచంద్ర జోషి, పోడూరు వైసిపి నాయకులు గుంటూరి పెద్దిరాజు, సర్పంచి ఇళ్ల లక్ష్మీచంద్రిక, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కేతా పద్మ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బి.విజయకుమార్, పెనుమంట్ర మండల కార్యదర్శి సుబ్బరాజు, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు షేక్‌వలీ, సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, బొంతు శ్రీను, తోటపల్లి సత్యనారాయణ, బొర్రా ధర్మారావు పాల్గొన్నారు.










