నిషేధంపై ముంచుకొస్తున్న గడువు
ఆందోళనలో ప్లాస్టిక్ బ్యానర్ల తయారీ దారులు
గడువు పెంచాలని కోరుతున్న వైనం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
ప్లాస్టిక్ బ్యానర్లపై ఉన్న గడువు ముంచుకొస్తోంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి తయారు చేసేందుకు వీల్లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంత త్వరలో ఇలా నిర్ణయిస్తే తమ గతి ఏమౌంతుందని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయం దొరికే వరకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. దీంతో ఏమి చేయాలో పాలుపోక వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం ప్లాస్టిక్ బ్యానర్ల కన్నా ముందుకు ఎక్కువగా ఎక్కడ చూసినా గుడ్డ బ్యానర్లే వాడేవారు. గోడ రాతలు కనపించేవి. ఈ మేరకు వస్త్రాల కొనుగోళ్లు పెరిగాయి. దుకాణాలకు ఆదాయం కూడా వచ్చేది. అంతేకాకుండా గోడలమీద రాసే వారికి ఉపాధి దొరికేది. అయితే పాస్టిక్ బ్యానర్లు వచ్చాక వీటి వాడకం తగ్గిపోయింది. ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా వీరు కనిపించడం లేదు. ఉపాధి లేకపోవడంతో ఇలాంటి వారంతా వేరే మార్గాల వైపు వెళ్లిపోయారు. ఒకరిద్దరు తప్ప వీరి జాడ మాయమైపోయింది. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా, ఎన్నికలొచ్చినా వీరికి భలే డిమాండు ఉండేది. అయితే డిజిటల్ బ్యానర్లు వచ్చాక, పల్లెల్లో సైతం ఇవే కనిపిస్తున్నాయి. సమయం తక్కువ, ఎక్కువ అందంగా ఉండడం వల్ల వీటికి డిమాండు పెరిగింది. ప్రధాన నాయకులు వస్తే ఈ ప్లాస్టిక్ బ్యానర్లతో దగదగలాడిపోతున్నాయి. బర్త్‌డే వేడుకల నుంచి చావు, కరమంత్రాల వరకు ఇవి విస్తారంగా వినియోగిస్తున్నారు. గుడ్డ బ్యానర్‌తో పోల్చితే ఇది ఖర్చు కూడా తక్కువే. దీంతో ప్రజల్లోకి అణువనువునా ఎక్కిపోయింది. మన జిల్లాలో ఇలా డిజిటల్ బ్యానర్లు ప్రింట్ చేసే షాపులు ఉమ్మడి జిల్లాలో 120 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లాలో మాత్రం 35 మంది ఉంటారని అంచనా.
కార్మికులపై ప్రభావం
ఆయా దుకాణాల్లో ఒక్కో దాంట్లో 10మంది దాకా వర్కర్లు ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాకుండా వీరు ఒక్కోక్కరూ ఇందులో రూ.10లక్షల వరకు ఖర్చు పెట్టారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వచ్చే ఆదాయంలో వాటిని కట్టుకుంటూ జీవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమను ఉన్నట్లుండి ప్రింటింగ్ మానేయాలని చెబితే ఎలా అని ఇందులో పనిచేస్తున్న కార్మికులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయం చూపించే వరకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. సంవత్సరం గడువు ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు.
ప్రత్నామ్యాయం కల్పించే వరకు
ఫ్లెక్సీల నిషేధంపై వాయిదా వేయాలి
- వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి
ప్లెక్సీల నిషేధంపై అవుట్ ఆఫ్ హోమ్ అడ్వర్టయిజ్‌మెంట్స్ ఇండిస్టీలోని ఉత్పత్తిదారులతో చర్చించాలి. సముచిత పరిష్కారం కనుగొనేవరకూ నిషేధాన్ని వాయిదా వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 1 నుండి ఫ్లెక్సీల ఉత్పత్తి, వినియోగాలను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మన దేశంలో సంవత్సరానికి 12 వేల కోట్ల వ్యాపారం అవుట్ ఆఫ్ హోం అడ్వర్టయిజ్‌మెంట్స్ ఇండిస్టీలోనే జరుగుతుంది. ఎటువంటి ప్రత్యామ్నాయ అవకాశాలు చూపకుండా నిషేధం తీసుకువస్తే ఆ రంగంపై ఆధారపడిన ఉత్పత్తిదారులు, కార్మికులు తీవ్రఇబ్బందులకు గురవుతారు. ప్రభుత్వమే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ఫ్లెక్సీల ఉత్పత్తిదారులందరూ చిన్న తరహా ఉత్పత్తిదారులు. ప్లాస్టిక్ ఫెక్సీల స్థానంలో క్లాత్ బ్యానర్లు ప్రింట్ వేసుకోవడానికి వీలుగా మిషనరీని అప్‌డేట్ చేసుకోడడానికి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడానికి సంవత్సరం గడువు మాత్రమే అడుగుతున్నారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని అవుట్ ఆఫ్ హోం అడ్వర్టయిజ్‌మెంట్స్ ఇండిస్టీలో భాగమై ఉత్పత్తిదారులతో కార్మికప్రతినిధులతో చర్చించి ఈసమస్యకు సముచితమైన పరిష్కారాన్ని కనుగొనాలి, అంతవరకు నిషేధాన్ని వాయిదా వేయాలి.










