Apr 18,2023 21:12

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ రమణారెడ్డి

          అనంతపురం కార్పొరేషన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధిత వస్తువుల అమ్మకాలను పూర్తిగా నిలిపేయాలని కమిషనర్‌ రమణారెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలో సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకం నియంత్రణపై మంగళవారం నాడు కమిషనర్‌ ఛాంబర్‌లో కమిషనర్‌ రమణారెడ్డి జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ సభ్యులతో మంగళవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తనిఖీలను నిబంధన మేరకు నగరంలో జరపాలన్నారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు నిల్వ ఉంచుకున్నా, అమ్మకాలు జరుగుతున్నా, సంబంధిత విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సింగల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకంపై నియంత్రణ పూర్తిగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఇదివరకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, వాడకం, అమ్మకాలను పూర్తిగా నిషేధించాయన్నారు. ఈ విషయంపై నగరపాలక సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పలుమార్లు వివిధ మార్గాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారని చెప్పారు. ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించే వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి నిషేధించిన వస్తువులపై తెలియజేశామన్నారు. ఇటీవల జరిపిన ఆకస్మిక తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను సీజ్‌ చేశామన్నారు. భవిష్యత్తులోనూ తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. నిషేధిత ప్లాస్టిక్‌ను అమ్మకుండా, వినియోగండా ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి, పోలీస్‌, కమర్షియల్‌, ప్రజారోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.