నిర్వహణ నిధులెక్కడ..?
జేబుల నుంచి ఖర్చు పెడుతున్న ఉపాధ్యాయులు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
మీ పిల్లలను బడులకు పంపపండి.. అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది.. బడి ఈడు పిల్లలు బడుల్లోనే ఉండాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరగాలి.. గోరుముద్ద, అమ్మఒడి, జగనన్న కానుక, నాడు -నేడు విద్యావైద్యానికి అత్యంత ప్రాధాన్యత... ఇవి రోజూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు...
ప్రభుత్వబడుల బలోపేతానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచివే.. అయితే బడుల నిర్వహణ కోసం పైసా విదిల్చకపోవడంతో బడుల నిర్వహణ కోసం అయ్యోర్లు జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రభుత్వ బడుల్లోని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీనికి తోడు కరెంటు బిల్లులు సైతం తమ జేబుల నుంచే ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు నగరంలోని గిరింపేట ఉన్నతపాఠశాల హెచ్‌ఎం నెలకు కరెంటు బిల్లుల రూ.1,500 నుంచి 2000ల వరకు నాలుగు నెలలుగా తన జేబుల నుంచి ఖర్చు చేశారు ఉపాధ్యాయులు. అదనం స్టేషనరీ, రిజిస్టేర్లు ఇతర ఖర్చులు తానే భరించాల్సి వస్తోందంటున్నారు. పాఠశాల్లో చిన్నచిన్న మరమ్మతుల కోసం స్వంత డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోందంటున్నారు. ఇది ఈ ఒక్క పాఠశాల్లో మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
కొందరు ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తుంటే కొందరు పట్టించుకోవడం లేదు. బడుల నిర్వహణ కోసం నెలవారీ విడుదల చేసే నిధులు గత ఐదు,ఆరు నెలలుగా విడుదల కాకపోవడంతో ఫలితంగా ఆయా పాఠశాలల్లో అవసరమైన సుద్దముక్కల (చాక్‌ఫీసులు) దగ్గర నుంచి అన్నింటీకి ఉపాధ్యాయులే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎంత కాలం వారి సొంత ఖర్చు చేయాలంటూ ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 4,507 ఉన్నాయి. కొత్తగా ఎయిడెడ్ పాఠశాలలు కూడా విద్యాశాఖలో విలీనం అయ్యాయి. ప్రభుత్వ బడుల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరిక పెరిగింది. స్టేషనరీ ఖర్చులు కూడా పెరిగాయి. ఈ ఏడాది జూలైలో పాఠశాలలను పునఃప్రారంభించారు. పాఠశాలలు ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తోంది. అయితే బడుల నిర్వహణ కోసం నేటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు.
పాఠశాల్లో చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 30 మంది పిల్లలుంటే రూ.10వేలు 30 నుంచి 100మంది పిల్లలుంటే రూ.25వేలు, 100 నుంచి 250 మంది పిల్లలుంటే రూ.50వేలు, 250 నుంచి 1000మంది పిల్లలుంటే రూ.35వేలు మంజురు చేసే అవకాశముంది. బడుల నిర్వహణ ఖర్చు లెక్కలు బాగానే ఉన్నా ప్రభుత్వం విడుదల చేసే నిధులు విడుదల విద్యుత్ బిల్లులు, చాక్‌ఫీసులు, డస్టర్లు, పరీక్షల నిర్వహణ స్టేషనరీ, మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ఫినాయిల్, చీపుర్లు కోనుగోలు కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. నాలుగు నెలలకు పైగా నిధులు లేక పాఠశాల ప్రధానోపాధ్యాయులే జేబు నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒక్కనెల లేదు రెండు నెలలు అంటే సర్దుకోవచ్చు నాలుగు నెలలకు పైగా తమ చేతి నుంచి ఖర్చు చేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం నిర్వహణ ఖర్చుల కోసం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది
- విజయేంద్రరావు, జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి
బడుల నిర్వహణ కోసం మంజూరు చేసే నిధులు పెండింగ్ వాస్తవమే. ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయులు ఖర్చు చేసి డబ్బుల వివరాలను ఓచర్లతో సహా ఎంఇఒలకు పంపాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తరువాత తీసుకోవచ్చు. కొన్నిపాఠశాలల్లో పాఠశాల అభివృద్ధి కమిటీలు నిర్వహణ ఖర్చులు భరిస్తున్నాయి. నిధులు లేవనే సాకుతో ఎలాంటి అశ్రద్ధ చేయడానికి వీలులేదు. ప్రతి పాఠశాల్లో ఉపాధ్యాయులకు అవసరమైన స్టేషనరీతో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.










