
వానలు, వరదలు ముంచెత్తిన ప్రతిసారీ ముంపు ప్రాంతాల్లో వేలు లక్షల్లో ప్రజలు సర్వం కోల్పోయి నిర్వాసితులవుతున్నారు. ఇళ్లూ వాకిళ్లు వదిలేసి ఉన్న ఊళ్ల నుంచి కట్టుబట్టలతో తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో వరద తీసే వరకు తలదాచుకోవడం, మరలా సొంత గూటి బాట పట్టడం ముంపు బాధితులకు పరిపాటైంది. అప్పటికి నిర్వాసితులకు పాతికో పరకో పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం, ఆపై అటువైపు కన్నెత్తెయినా చూడకపోవడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. గోదావరి, కృష్ణా నదులకు మొన్నొచ్చిన వరదలకూ ముంపు బాధితులకు రూ.2 వేలు అత్యవసర సాయం ప్రకటించి అదే నిర్వాసితులకు పేద్ద సహాయంలా సర్కారు పేర్కొంటున్నది. ఊళ్లొదిలి పునరావాస కేంద్రాలకు, కొండ మీదికి పోయిన వరద బాధితులకు 5 కిలోల బియ్యం తప్ప మరేమీ ఇవ్వని దుస్థితి నెలకొంది. పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న ఒక గర్భిణి సహా ముగ్గురు దుర్మరణం పాలవ్వడం ఘోరం. విడ్డూరం ఏంటంటే... నిరుడు ఆగస్టు, సెప్టెంబర్ లో గోదావరికి వరదలొచ్చినప్పుడు అపన్నులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.5 వేల సహాయాన్ని సంవత్సరం గడిచాక ఇప్పుడు, అదీ ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేకు ముందు రోజు ఆదరాబాదరాగా పంచడం. నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికున్న కనికరం ఏపాటిదో ఈ ఒక్క ఉదంతం తెలియజేస్తుంది. వరదల మూలంగా పంటలు, తోటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు, గొడ్డు గోదా, ఇళ్లూ, పశువుల కొట్టాలు, పడవలు, వలలు, మరమగ్గాలు నష్టపోయిన బాధితులకు పరిహారాల చెల్లింపులకు ఏళ్లూ పూళ్లు పడుతున్నాయి. సర్కారీ సాయాల కోసం వరద, తుపాను బాధితులు నిరీక్షణతోనే కాలం వెళ్లదీస్తున్న దుస్థితి.
వరదలనగానే మొదట బాధితులయ్యేది ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసిత గ్రామాల ప్రజలు. జాతి హితం కోసం తమ భూములను వదులుకొనేందుకు సైతం సిద్ధపడిన నిర్వాసితులకు తాము హామీ ఇచ్చిన మేరకు సకాలంలో సహాయ, పునరావాస ప్యాకేజీలు అమలు చేయడంలో పాలకులది ఉద్దేశపూర్వక నిర్లక్ష్య ధోరణి. అందుకు పక్కా ఉదాహరణ ఈ సాంకతిక యుగంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఉదంతం. 'పోలవరం'లో దాదాపు 300 గ్రామాలను, మూడు లక్షల మంది ప్రజలను, అందులోనూ అత్యధిక సంఖ్యలో ఆదివాసీలను ప్రభుత్వం ముంచుతోంది. ప్రాజెక్టును చేపట్టి దశాబ్దంన్నర అవుతున్నా, రాష్ట్ర విభజన నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడి ఆరేళ్లు దాటినా నేటికీ నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ కల్పించలేదు. గత టిడిపి ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోకుండా ప్రాజెక్టు పనులు చేపట్టింది. ప్రస్తుత వైసిపి సర్కారు రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లను మార్చడంపై శ్రద్ధ చూపి నిర్వాసితులను విస్మరించింది. 2013 పునరావాస చట్టాన్నే నీరుగార్చే సవరణలు తెచ్చి నష్టపరిహారం నామమాత్ర స్థాయికి తగ్గించడమేగాక పోలవరం విషయంలో తన బాధ్యత ప్రాజెక్టు వరకే తప్ప పునరావాసం బాధ్యత లేదని కేంద్ర బిజెపి ప్రభుత్వం అంటోంది. గోదావరి పోటెత్తితే కాఫర్‌డ్యామ్ వలన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గ్రామాలు మునుగుతున్నాయి. కృష్ణా వరదలతో 'పులిచింతల' కింద 5 గ్రామాల్లో ఇదే పరిస్థితి. వంశధారకు వరదలొస్తే 7 వేల కుటుంబాలదీ అంతే. అర్ధ శతాబ్దం క్రితం నిర్మించిన శ్రీశైలం నిర్వాసితుల సమస్య నేటికీ తేల్లేదు. చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టు నిర్వాసితుల విషాద గాధలతో ఒక పెద్ద గ్రంథం తయారవుతుంది.
నదీ పరీవాహ ప్రాంతం వెంబడి విస్తరించిన గ్రామాలు, పట్టణాలు, నగరాల ప్రజానీకం పరిస్థితి ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితికి ఎంతమాత్రం తీసిపోదు. 2005లో గోదావరి, కృష్ణా నదులు ముంచెత్తినప్పుడు కరకట్టలను శాశ్వత ప్రాతిపదికన పటిష్టమొనర్చాలనుకున్నారు. భారీగా అంచనాలు వేసి కేంద్రం నుంచి సాయం కోరారు. ఇప్పటికీ కరకట్టల నిర్మాణాలు చేపట్టలేదు. వరదలొచ్చినప్పుడు లీకేజీల దగ్గర సిమెంట్, ఇసుక బస్తాలు అడ్డం వేయడంతోనే సరిపెడుతున్నారు. సరైన రక్షణ వ్యవస్థలు, సమగ్ర ప్రణాళికలు లేకపోవడం వల్లనే తరచు కృష్ణకు, బుడమేరుకు కొద్దిపాటి వరదలొచ్చినా బెజవాడ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఒక్క బెజవాడే కాదు చాలా చోట్ల ఇలానే ఉంది. 2009లో శ్రీశైలం బ్యాక్ వాటర్ కర్నూలును ఏ విధంగా బురదమయం చేసిందో అనుభవం ఉన్నా నేటికీ రక్షణ వ్యవస్థ రూపుదిద్దుకోలేదు. ప్రాజెక్టు నిర్వాసితులకు '2013 ఆర్‌ఆర్ ప్యాకేజీ' అమలు చేయాలి. ముంపుతో నిర్వాసితులైన ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలి. ముందు నిర్వాసితులకు పునరావాస కల్పన- ఆ తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం అన్న సూత్రాన్ని కచ్చితంగా పాటించాలి.