Oct 06,2023 21:02

ఫొటో : అసంపూర్తిగా నిలిచిన రాజులపాడు రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి
ప్రజాశక్తి-మర్రిపాడు : వలసలను నివారించి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కటారి అజరుకుమార్‌ పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి సాధన కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మర్రిపాడు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న జిల్లాగా నెల్లూరు అని చెప్పేవారన్నారు. దాదాపు 16 మండలాలు తిరుపతి జిల్లాకు వెళ్లిన తర్వాత 38 మండలాలతో మెట్టప్రాంతం జిల్లాగా మిగిలిందన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో 35 మండలాలు మెట్టప్రాంతాలుగా ఉన్నాయన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఎంతోమంది రాజకీయంగా ఉన్నతమైన పదవులు పొంది రాష్ట్ర ప్రభుత్వంలో స్థాయి కలిగిన వ్యక్తులు ఉన్నా అభివృద్ధి ఎక్కడా కనిపించలేదన్నారు. బద్వేల్‌ తర్వాత నెల్లూరు వరకు నిరుద్యోగుల ఉపాధి కోసం ఏవైనా ఫ్యాక్టరీలో ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆత్మకూరులోని నారంపేట వద్ద ఫ్యాక్టరీ మంజూరై పనులు చేపట్టిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బద్వేల్‌ ప్రాంతానికి తీసుకెళ్లారన్నారు. ఆ ఫ్యాక్టరీ ఉంటే నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించేవి కానీ దురదృష్టవశాత్తు అది వెళ్లిపోయిందన్నారు. మెట్ట ప్రాంతాల అభివృద్ధి కోసం సోమశిల ప్రాజెక్టును నిర్మించి 30 ఏళ్లు అయినా మర్రిపాడు మండలానికి నీళ్లురాలేదని, అనంతసాగరం మండలానికి దిక్కు లేదన్నారు. సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ పనులను పాదయాత్ర బృందం చూడగా శిలాఫలకం మాత్రమే ఉండి సమాధి రాయిగా మిగిలిపోయిందన్నారు. హై లెవెల్‌ కెనాల్‌ పనులు ప్రారంభించి 10ఏళ్లు దాటినా తట్టెడు మట్టి కూడా వేయలేదని, రాష్ట్ర బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. మెట్ట ప్రాంతాలలో ఉపాధి పనులు తప్ప వేరే పనులు లేవని, 100 రోజుల ఉపాధి హామీ కూలి పని ఉన్నా 30 రోజులు కూడా పని కల్పించడం లేదని, ఇచ్చే డబ్బులు కూడా సక్రమంగా రావడం లేదన్నారు. మోతుబరి రైతు అయిన పనులు లేనప్పుడు ఉపాధి పనులకు వెలితేనే నాలుగు వేళ్లు లోనికి వెళ్లేదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాలన్నారు. గ్రామాలలో ఉండే యువతి యువకులకు పనులు లేక బయట రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటూ బతుకుతున్నారని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు మళ్లీ ఓట్లకు రాబోతున్నారని తమ ప్రాంతం గ్రామాభివృద్ధి కోసం ఏమి చేశారని నిలదీసి అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులకు స్థానిక రైతులు భూములను ఇస్తే ప్రధాని వ్యాపారవేత్త అదానికి అప్పగించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలను కనికరించాలని కోరారు. అనంతరం ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య పాదయాత్ర బృందంతో కలిసి నిధులు లేక పనులు నిలిచిపోయిన రాజులపాడు రిజర్వాయర్‌ను పరిశీలించారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రూ.800కోట్ల నిధులను విడుదల చేయగా కొన్ని పనులు చేపట్టారు. గతంలో టిడిపి ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు. మేఘా కంపెనీ పైపులు వేసి సగం పనులు చేశారన్నారు. ప్రాజెక్టు మొదటి భాగం చాపురాలపల్లి, ఎగువపల్లి కేతామన్నేరు వాగుపై రిజర్వాయర్‌ కట్టి 13 కిలోమీటర్లు పొంగూరు భీమవరం దగ్గర రిజర్వాయర్లు నిర్మించి అక్కడి నుండి రాజులపాడు రిజర్వాయర్‌కు నీళ్లు అందించడం ద్వారా మండలంలోని భూములు సస్యశ్యామలంగా ఉంటాయని పేర్కొన్నారు. మొదటి ఫేజ్‌లో పనులు నిలుపు వేసి ఫేజ్‌-2లో పనులు చేపట్టడం దుర్మార్గమన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 90 వేల ఎకరాలకు సాగునీరు రెండు లక్షల మందికి తాగునీరు అందిస్తుందన్నారు. అక్టోబర్‌ 13న నెల్లూరులో జరిగే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొనే జయప్రదం చేయాలనివారు కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, గంట లక్ష్మీపతి, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, మండల కార్యదర్శి రహమతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు శ్యామలమ్మ, మూలి ప్రమీల, మండల వ్యవసాయ సంఘం నాయకులు, సుధాకర్‌, మహమ్మద్‌ గౌస్‌, రామయ్య, సీనియర్‌ నాయకులు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.