ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ గేయనంద్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని సాయి గంగా కోచింగ్ సెంటర్లలో డివైఎఫ్‌ఐ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో 35ఏళ్లలోపు యువత 65 శాతం ఉన్నారన్నారు. అలాంటి యువతకుఉద్యోగ, ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. డిగ్రీలు, పీజీలు చదివి కూలి పనులకు వెళ్తున్నారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం తప్ప దేశ ప్రజల కష్టాలు తీర్చడానికి పని చేయడం లేదన్నారు. మోడీ సర్కార్ లేబర్ కోడ్‌లు తెచ్చి కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీకి కృషి చేయాలన్నారు. గిరిజన బ్యాక్‌లాగ్ పోస్టులు లక్షల సంఖ్యల్లో ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. మరోవైపు సైన్యంలో రిక్రూట్మెంట్ కోసం యువత ఎదురు చూసిన తరుణంలో అగ్నిపథ్ తీసుకొచ్చి ఆళలను ఆవిరి చేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. లేనిపక్షంలో ప్రభుత్వాలు యువత పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా యువకులు పోరాటాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలకృష్ణ, నరసింహా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధు, గిరి, తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ గేయనంద్










