జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
స్పందనలో అందిన ప్రతి దరఖాస్తునూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి 321 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో అందిన వినతుల పరిష్కారం అర్జీదారులకు ఆనందం కలిగించేలా ఉండాలన్నారు. అర్జీలు తిరిగి రీ ఓపెన్ అయ్యే అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఒకే సమస్యపై రెండోసారి స్పందనలో ఫిర్యాదు రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిరోజూ స్పందనపై పది నిమిషాలు సమయం కేటాయించినట్లయితే ఎప్పుడు సమస్యలు అప్పుడే పరిష్కారం అవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ దాసి రాజు, డిపిఒ ఎం.నాగలత, డిఎల్‌డిఒ కెసిహెచ్.అప్పారావు, భీమవరం డిఎస్‌పి బి.శ్రీనాథ్ పాల్గొన్నారు.










