ప్రజాశక్తి - భీమవరం
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు నిర్ణీత గడువులోగా సిద్ధం చేస్తామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో క్లయిమ్స్ పరిష్కారం, వెరిఫికేషన్, ఫామ్-6బి, డుప్లికేట్ ఓటర్ల తొలగింపు, రాండమ్ తనిఖీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొమ్మిది అంశాల అజెండాలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధత, ఓటర్ల జాబితా, బిఎల్‌ఒ రిజిస్టర్, రాబోయే 2024 సాధారణ ఎన్నికలకు ముందస్తు కార్యాచరణ, రాజకీయ పార్టీలు సమన్వయ సమావేశం, తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకంగా ఓటరు జాబితా సిద్ధం చేయడంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, నరసాపురం సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ, భీమవరం ఆర్‌డిఒ దాసిరాజు, నియోజకవర్గ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.










