సర్వే తప్పులు లేకుండా చూడాలి
నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి : జెసి
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి:
రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా భూసమస్యలను తొలగించేందుకు రీసర్వే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈకార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని జాయింట్‌కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జెసి బైరెడ్డిపల్లి తహశీల్దార్ కార్యాలయంలో రీసర్వే కార్యక్రమంలో ఫైనల్ ఆర్‌ఓఆర్ అనంతరం జరుగుతున్న క్లరికల్ వెరిఫికేషన్ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఐదు గ్రామాల్లో ఫైనల్ ఆర్‌ఓఆర్ ప్రకటించడం జరిగిందని, దీనికి సంబంధించి వెరిఫికేషన్ కూడా పూర్తి అయిందని, ఇంకా ఏవైనా చిన్నచిన్న తప్పులు జరిగుంటే సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. భూహక్కు పత్రాలు త్వరలో రానున్నాయని దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎటువంటి లోపం లేకుండా పూర్తి చేయాలన్నారు. మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉండగా 18గ్రామాలకు సంబంధించి డ్రోన్ ఫ్లై కార్యక్రమం పూర్తి అయిందని ఇందులో 5 గ్రామాలకు సంబంధించి ఫైనల్ ఆర్‌ఓఆర్ విడుదల చేయడం జరిగిందని, మరో 13గ్రామాలకు సంబంధించి వివిధ దశలలో రీసర్వే పనులు జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు. సంబంధిత గ్రామ సర్వేయర్లు మండల సర్వేయర్లు డిఐలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రీసర్వే పనులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శివయ్యతోపాటు తహశీల్దార్ కుమారస్వామి సర్వేయర్ల బందం పాల్గొన్నారు.
గుడిపల్లి: రీసర్వే ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని, శతాబ్ద కాలం తర్వాత పూర్తిస్థాయిలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉపయోగించి రీసర్వే చేయడం జరుగుతుందనిజాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. జాయింట్ కలెక్టర్ మంగళవారం సాయంత్రం కుప్పం, గుడిపల్లి మండలాలలో క్లరికల్ స్థాయిలో జరుగుతున్న వెరిఫికేషన్ కార్యక్రమంను పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు మండలాల్లో ఈప్రక్రియను వేర్వేరుగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రెండు మండలాల్లో ఎక్కువ గ్రామాల్లో ఫైనల్ ఆర్‌ఓఆర్ విడుదల చేయడం జరిగిందని ప్రస్తుతం వెరిఫికేషన్ కార్యక్రమంలో ఎటువంటి తప్పులు దొర్లడం జరిగిందని సర్వేయర్లను అడిగారు. ఈ సందర్భంగా వారు జరిగిన తప్పులు పరిష్కారం చేసిన విధానం గురించి వివరించారు. తప్పులసవరణ కోసం అవకాశం ఇవ్వబడిందని ఎటువంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శివయ్యతో పాటు తహశీల్దార్ సురేష్, గుర్రప్ప పాల్గొన్నారు.










