
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస: నిర్ణీత గడువు లోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని తొగరాంలో గల స్పీకర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన హౌసింగ్ అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గాజుల కొల్లివలసలో సుమారు 1734 ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధిలో వేసిన లేఅవుట్లు, సొంత స్థలాల్లో కలిపి సుమారు 8, 598 ఇళ్లు మంజూరయ్యాయని వాటి నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటివరకు 5,334 ఇళ్లు పూర్తయ్యాయని 1,440 ఇళ్లు పలు దశల్లో నిర్మాణంలో ఉన్నాయని అధికారులు వివరించారు. మిగతా ఇళ్ల నిర్మాణాలు ఎందుకు ప్రారంభించలేదని స్పీకర్ ప్రశ్నించారు. డిసెంబరు నెలాఖరుకు ప్రతి లేఅవుట్‌లో శతశాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పుడు నిర్మిస్తున్నవి జగనన్న కాలనీలు కాదని, కొత్తగా ఊళ్లనే ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వమే అందిస్తోందన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ గణపతి, ఇఇ అప్పారావు, ఎఇలు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.