నిర్మాణాల్లో నాణ్యత కరువైతే చర్యలు తప్పవు
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి : కలెక్టర్
ప్రజాశక్తి- గంగవరం: విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం మెనూను నిర్దేశించడం జరిగిందని, ఈ మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ట్రైనీకలెక్టర్ వై.మేఘస్వరూప్‌తో కలసి గంగవరం మండలంలో పర్యటించి ప్రభుత్వ అభివద్ధి కార్యక్రమాల పురోగతి తీరును పరిశీలించారు. పర్యటనలో భాగంగా పసుపుత్తూరులో నిర్మాణ పనులు జరుగుతున్న రైతు భరోసాకేంద్రం, వైఎస్‌ఆర్ హెల్త్‌క్లినిక్ నిర్మాణ పనులను, పత్తికొండ జడ్పీ హైస్కూల్ నందు రెండో విడతలో నాడు- నేడు పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్‌లను తనిఖీ చేశారు. అనంతరం పెద్దనపల్లిలో ఎంపీ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం కీలపట్లలో రీసర్వే పనుల పురోగతిని పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం సౌకర్యం కల్పించాలని సూచించారు. మెనూ ప్రకారం నేడు వెజిటబుల్ రైస్, ఎగ్, చిక్కి విద్యార్థులకు వడ్డిస్తుండగా ఆ భోజనాన్ని కలెక్టర్ రుచి చూసి మరింత రుచికరంగా విద్యార్థులకు భోజనాన్ని సిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచించారు. జగనన్న విద్యా కానుక కిట్లు అందరికీ అందాయా లేదా అని కలెక్టర్ ప్రశ్నించగా అందరికీ అందాయని విద్యార్థులు తెలిపారు. జడ్పీ హైస్కూల్‌లో రెండోవిడత నాడు- నేడులో భాగంగా 10కాంపోనెంట్ల కింద రూ.42లక్షల అంచనావ్యయంతో జరుగుతున్న పనులను నాణ్యతతో పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం పత్తికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ప్రధానమంత్రి సురక్షిత మాతత్వ అభియాన్ కింద గర్భిణులకు అందిస్తున్న వైద్యసేవల గురించి మెడికల్ ఆఫీసర్‌ను వివరాలు అడిగారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేసి ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు మంచి పౌష్టికాహారంను అందించాలని, ఆటపాటలతో విద్యను పరిచయం చేయాలని సూచించారు. తదుపరి కీలపట్లలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించి రీసర్వేకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించి రీసర్వే పనులు పూర్తి చేయాలన్నారు. గంగవరం మండలంలో మూడు గ్రామాలు కీలపట్ల, కలగటూరు, కల్లుపల్లి రీసర్వేకి ఎంపిక కాగా కీలపట్లలో 27.6 కిలోమీటర్ల విలేజ్ బౌండరీకి గాను 17 కిలోమీటర్ల పూర్తి చేయడం జరిగిందని, కలగటూరులో 13.10 కిలోమీటర్ల విలేజ్ బౌండరీ పూర్తి చేయడం జరిగిందని, కల్లుపల్లి నందు 15.70 కిలోమీటర్ల విలేజ్ బౌండరీ పూర్తి చేయడం జరిగిందని డిఐ రవిచంద్ర కలెక్టర్‌కు వివరించారు. ఈ పర్యటనలో జిల్లాకలెక్టర్ వెంట ఎంపీడీఓ శివప్రసాద్, ఎంఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు.










