
* నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలి
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం : జిల్లాలో ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయ అధికారులు, ఎంఇఒలకు నిర్దేశించిన లక్ష్యాలను రెండు రోజుల్లోగా సాధించాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ హెచ్చరించారు. సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు బాగానే నడుస్తున్నా, మరికొన్ని పథకాలు వెనుకంజలో ఉన్నాయన్నారు. అటువంటి వాటిపై ఎంపిడిఒలు, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం జిల్లాలో బాగానే జరుగుతున్నా, ఇంకా నాలుగు శాతం పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. వాటిని రానున్న రెండు రోజుల్లోగా ప్రారంభించాలని, ప్రగతి కనబరచని మండలాల అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 36వేల గృహాలు పూర్తి కాగా, పూర్తయిన గృహాలకు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు పూర్తి కావాలని, అవి పూర్తయితే స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నుంచి రూ.12 వేలు లబ్ధిదారునికి అందుతుందని స్పష్టం చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వం (జిజిఎంపి) కార్యక్రమం కింద 2,407 పనులకు అనుమతులు మంజూరు చేశామని, అందులో కొన్ని పనులు ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటివరకు పూర్తయిన 2099 పనులకు గానూ కొందరు బిల్లులను అప్‌లోడ్ చేయలేదని, చేసిన వెంటనే నిధులు మంజూరవుతాయని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈనెల 30 నుంచి ప్రారంభం కానుందన్నారు. 594 సచివాలయాలతో పాటు 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మ్యాపింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇంటింటికీ వాలంటీరు వెళ్లి ఆ కుటుంబంలోని ఆరోగ్య సమస్యలపై వివరాలు సేకరించి టోకెన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తద్వారా గ్రామంలో నిర్వహించే ఆరోగ్య శిబిరం వద్ద అన్ని వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా పొందవచ్చన్నారు. గ్రామంలో నిర్వహించే వైద్య శిబిరం తేదీపై ముందుగా అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి శిబిరంలో ఇద్దరు వైద్యులు, స్పెషలిస్టు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కార్యక్రమాలకు అంతరాయం ఉండరాదన్నారు. జిల్లాలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో 187 సచివాలయాల్లో పూర్తయిందని, ఇంకా 562 సచివాలయాల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లోగా వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎనిమిది స్థిరమైన లక్ష్యాలను నిర్దేశించడమైందని, వాటిపై వాటిపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్.గణపతి, ముఖ్య ప్రణాళిక అధికారి వి.ఎస్.ఎస్.ఎల్ ప్రసన్న, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, సమగ్ర శిక్ష ఎపిసి ఆర్.జయప్రకాష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.