రాయదుర్గం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చేలా నిర్ధిష్టమైన అభివృద్ధి సంక్షేమ ప్రణాళికతో ముందుకు వెళ్తామని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలకు వివరించి వారి ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రాయల్ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గస్థాయి ప్రముఖులు, మేధావులతో చంద్రబాబు బుధవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సైకో జగన్ ప్రతిపక్షాలు, ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. తనతో పాటు కాలవ శ్రీనివాసులు, టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై గళం ఎత్తే వారిపై తప్పుడు కేసులు పెట్టడమే పాలన అన్నట్లు జగన్ ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నేరం చేయడంలో ఆయన మాస్టర్ డిగ్రీ పొందాడన్నారు. వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో ఇదే నిర్ధారణ అయ్యిందన్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపే కుట్ర సాగుతోందన్నారు. తాను రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో జరుగుతున్న నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలను నిలదీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని చెప్పారు. బిటిపి, పేరూరు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయలేదన్నారు. హంద్రీనీవా నీరు చిత్తూరు, పుంగనూరు, కుప్పం ప్రాంతాలకు తీసుకెళ్లక, వాటికి సమాంతర కాలువ పేరిట 5400 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆయన అనుయాయులకు ఆ పనులను జగన్ కట్టబెట్టారన్నారు. పుంగనూరులో ఎలాంటి డిపిఆర్ లేకుండా కృష్ణ వాటర్ బోర్డ్ అనుమతి లేకుండా ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ 3500 కోట్ల రూపాయల ఖర్చుతో చేశారన్నారు. ఎలాంటి నీటి కోటా లేకుండా వేలకోట్ల రూపాయల పనులు ఎలా చేపడతారని చంద్రబాబు ప్రశ్నించారు. రైతులకు చెప్పకుండా, వారికి పరిహారం ఇవ్వకుండానే పొలాల్లో కాలువలు కూడా తవ్వారన్నారు. తాను చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తే తనపైనే దాడి చేసి తానే హత్యాయత్నం చేశానని తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిచామని చెప్పారు. ఈ పథకాలకు జగన్ పేరుమార్చి బటన్ నొక్కాడు కార్యక్రమం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. సైకో జగన్ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో 122 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో చినుకు జాడలేని దుర్భిర పరిస్థితులు వచ్చాయన్నారు. రంగాల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తమ పార్టీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు. సౌర, పవన, జల విద్యుత్ ఆధునిక విధానాన్ని అమలు చేసి రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తామన్నారు. 2047 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండేలా తాము నిర్దిష్ట ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. మరో నాలుగు, లేదా ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని ప్రజలు తమకు అండగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో పాటు వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.










