నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలి
జిల్లా కలెక్టర్ హరినారాయణన్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరేలా పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. సోమవారం సాయంత్రం ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గహనిర్మాణశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా మ్యాపింగ్ మరియు రిజిస్ట్రేషన్ కానీ ఇళ్లస్థలాలకు సంబంధించి రెండు రోజులలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా బేస్మెంట్ స్థాయి కన్నా తక్కువ ఉన్న గహనిర్మాణాల పైన దృష్టి సారించాలని, వేగవంతంగా వాటిని బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని, బేస్మెంట్ స్థాయి నుంచి స్టేజి కన్వర్షన్ వేగంగా చేయాలని అన్నారు. మండలస్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరేలా చూడాలని వారంవారం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరకపోతే గృహనిర్మాణాలను ఎలా పూర్తిచేస్తారని అన్నారు. వర్షాలు ప్రస్తుతం ఆగిపోయాయని స్టేజి కన్వర్షన్ బిబిఎల్ స్థాయిలో ఉన్న గహ నిర్మాణాలపై దష్టి పెట్టి వేగంగా పూర్తిచేయాలని అన్నారు. అధికారులు ఎక్కడ ఇసుక సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎంచుకున్న టార్గెట్లలో తక్కువ లక్ష్యాలను సాధించిన మండల అధికారులను అందుకు తగిన కారణాలను ప్రశ్నించారు. అదేవిధంగా సిమెంట్ ఇతర మండలాల నుంచి తీసుకొని ఇళ్లనిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ట్రైనీకలెక్టర్ మేఘ స్వరూప్, హౌసింగ్ పిడి పద్మనాభం పాల్గొన్నారు.










