Sep 25,2023 22:13

నిర్బంధాలు, అరెస్టులను నిరసిస్తూ..
అంగన్వాడీల ధర్నాలు
సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుదాం
గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు పిలుపు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధాలకు గురిచేయడం దుర్మార్గమని, ఈ నిర్బంధాన్ని నిరసిస్తూ సోమవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండన్‌ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా తమ గోడు చెప్పుకోవడానికి వస్తున్నవారిపై అమానుషంగా నిర్బంధానికి గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు పక్క రాష్ట్రం కంటే అదనంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలైనా జీతాలు పెంచలేదని విమర్శించారు. రకరకాల యాప్‌ల పేరుతో అంగన్వాడీలపై పనిభారం భారీస్థాయిలో పెంచారని విమర్శించారు. అన్ని రకాల ప్రభుత్వ పనులు చేస్తున్నప్పటికీ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్వివిటీ అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నేడు అంగన్వాడీలు అడుగుతున్న కోరికలు గొంతెమ్మ కోరికలు కాదని ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం చేస్తే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి లేదు కదా అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచించకుండా పోలీసులు ద్వారా ఉద్యమాలను అణచాలని ప్రయత్నం చేయడం అరిచేత్తో సూర్యకాంతిని ఆపడం ఎంత అవివేకమో ఇది కూడా అంతేనని అన్నారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీ పోరాటాలపై నిర్బంధాన్ని విధిస్తే ఆప్రభుత్వాలను ఇంటికి పంపించిన చరిత్ర అంగన్వాడీలకు ఉందని, అలాంటి పరిస్థితిని మీరు తెచ్చుకుంటున్నారు. ఛలో విజయవాడ బయలుదేరుతున్న అంగన్వాడీలను రకరకాల పద్ధతుల్లో ఒకరోజు ముందు నుంచి ఇండ్ల దగ్గర నిర్బంధాలు గురిచేయడం, వెళుతున్న వారిని పోలీస్‌స్టేషన్లో తరలించి రాత్రి వరకు స్టేషన్లో పెట్టించడం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కు ప్రకారం రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా కూడా చేయనీయకుండా ఉంటే ప్రభుత్వానికి ఎందుకు అంత భయమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు సజని, మమత, అంబికా, ప్రమీల, ఆముద, శాంతి, కన్యాకుమారి, హిమబిందు, సునీత, ఏఐటీయూసీ నాయకులు గోపీనాథ్‌, రమాదేవి, దాసరి చంద్ర, మహిళా సంఘం నాయకులు విజయగౌరి అంగన్వాడీలు పాల్గొన్నారు.
పోలీసుల ఓవరాక్షన్‌
సోమవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు వద్దకు వచ్చి మహిళా ఎస్‌ఐ ధర్నా చేయడానికి పర్మిషన్‌ లేదని దబాయించడంతో మహిళలు తిరగబడ్డారు. దీంతో కొద్దిసేపు ఉద్రిత్తత కొనసాగింది. శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమానికి ఎందుకు అడ్డంకులు పెడుతున్నారని అంగన్వాడీలో భారీగా నినాదాలు చేయడంతో వెనక్కి తగ్గిన పోలీసులు ధర్నా కొనసాగేంత వరకు వేచి చూశారు.
కుప్పం: అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ సోమవారం కుప్పం- పలమనేరు జాతీయ రహదారిలోని ఏరియా ఆసుపత్రి సర్కిల్‌ వద్ద అంగన్వాడీలు ధర్నాకు దిగారు. దీంతో దాదాపు గంటకు పైగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో వానదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుప్పం ఎస్సై శివకుమార్‌ అంగన్‌వాడీలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. అనంతరం అంగన్వాడీలు అక్కడి నుండి బయలుదేరి తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా చేపడుతున్న శిబిరానికి చేరుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
పలమనేరు: అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌హెల్పర్స్‌ న్యాయమైన సమస్యలను అడగడానికి వెళితే అక్రమ అరెస్టులు చేయడం సరికాదని యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సరస్వతీ, చిలకమ్మా ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం పలమనేరు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ కుప్పస్వామికి అందజేశారు. అంగన్వాడీలు నిర్మల, భారతి, నాగరత్న, పరిమళ, విజయమ్మ, సులోచన పాల్గొన్నారు.
బైరెడ్డిపల్లి: అంగన్వాడీ యూనియన్‌ లీడర్‌ వెంకటరత్నం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా విజయవాడకు వెళుత్తున్న తమను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడం దారుణమ్నారు.
కార్వేటినగరం: సోమవారం కార్వేటినగరంలోని మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ప్రాజెక్టు పరిధిలోని కార్వేటినగరం, వెదురుకుప్పం, శ్రీరంగరాజాపురం మండలలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్‌ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా గౌరవాధ్యక్షులు కాంచన మాల, సభ్యులు నాగమ్మ, నాగమణి, ఉమా, యువరాణి, గుణ, విద్య, సుధారాణి, రెడ్డమ్మ, పాల్గొన్నారు.