నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు
సమస్యలపై స్పదించకుంటే సమ్మెకు వెళ్తాం: ధర్నాలో సిఐటియు , ఏఐటియుసి నాయకుల హెచ్చరిక
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
న్యాయమైన సమస్యలపై అంగన్‌వాడీలు, ఆయాలు, మినీవర్కర్లు రాష్ట్రంలో లక్ష మందికి పైగా జరుపుతున్న పోరాటంపై పోలీసు జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిఐటియు -ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి కె.సురేంద్రన్, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు నాగరాజు, ఎపి.అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సుజని, ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్స్‌పై పోలీసులను ఉపయోగించి జరిపిన నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఊరేగింపుల నిరసన తెలియజేసే ప్రాథమిక హక్కును కూడా రాష్ట్ర ప్రభుత్వం భంగం కలిగించింది. తీవ్రమైన పోలీసు నిర్బంధాన్ని మహిళలపై ప్రయోగించడం రాష్ట్ర ప్రభుత్వ రాక్షస చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్మికులకు తెలంగాణా కంటే అదనంగా జీతాలు పెంచుతానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి తన వాగ్దానాన్ని ధిక్కరించారు. ఫేస్ యాప్‌లు, అనేక రూపాల్లో పనిభారం పెంచి అంగన్‌వాడీలపై పనిఒత్తిడి పెంచారని, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా నిర్బంధాన్ని కొనసాగిస్తే రాష్ట్రంలో యావత్తు కార్మికవర్గం ఐక్యమై నిరవధిక పోరాటాలకు దిగాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్మిక సంఘాలు ఐక్యంగా విజయవాడలో ధర్నాచౌక్ వద్ద సెప్టెంబర్ 25న ధర్నా నిర్వహించడానికి పోలీసుల అనుమతి కోరారని, ముందుగా అనుమతి కోరినా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించి సెక్షన్ 30, సెక్షన్ 144ను ప్రయోగించారని తెలిపారు. శాంతియుతంగా జరిగే ఉద్యమాలపై కూడా నిర్బంధాలు విచ్చల విడిగా చేయడం చట్టవ్యతిరేకం. సోమవారం పోలీసులు విజయవాడ ధర్నాను భగం చేయడానికి నాలుగు రోజుల నుంచి జిల్లాలో నోటీసులను జారీ చేయడం, నాయకులను ఇళ్ల వద్దకు వెళ్లి బెదిరించడం, జిల్లాల నుంచి వచ్చే వారిని అడ్డుకోవడం సాగించారని అన్నారు. రెండురోజుల నుండి చిత్తూరు జిల్లాల్లో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్స్‌లో కాపలా పెట్టి దొరికిన వారిని దొరికినట్టు అరెస్టులు చేశారన్నారు. అనేక చోట్ల మగ పోలీసులే ఆడవాళ్లను లాగి పోలీసు వ్యానుల్లో విసిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వెళ్ళె నాలుగు బస్సులను పలమనేరు వద్ద సీజ్ చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచించకపోతే అక్టోబర్ నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, ఆముదం, శాంతి, కన్యాకుమారి, ఏఐటీయూసీ నాయకులు రమాదేవి, దాసరి చంద్ర కార్మికులు పాల్గొన్నారు.










