ప్రజాశక్తి - వీరవాసరం
సమస్యలను పరిష్కరించాలని అడుగుతుంటే నోటీసులిచ్చి గృహ నిర్బంధాలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పడాన్ని రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నట్టుగా ఎపిలో జీతాలు ఇస్తూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈ నెల 20న అంగన్‌వాడీ, మిడ్డేమీల్స్ రాష్ట్ర సంఘాలు చలో విజయవాడ నిర్వహించకుండా ముందస్తుగా సిఐటియు, రైతు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, అంగన్‌వాడీ నాయకులకు నోటీసులివ్వడం పట్ల నరసింహమూర్తి తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఉదయం తనకు, ప్రజా సంఘాల నాయకులకు నోటీలిచ్చారని తెలిపారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని తెలిపారు.
తణుకురూరల్ : ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ప్రతాప్ అన్నారు. ఈ నెల 20న జరిగే చలో విజయవాడను ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఆందోళనకారులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలు వంటివి మానుకొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పనిచేస్తున్న వారి ఇంటికి వెళ్లి అర్ధరాత్రి సమయంలో మహిళలు అని చూడకుండా నోటీసులివ్వడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఇటువంటి చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు విడనాడక పోతే తగిన గుణపాఠం తప్పదన్నారు. అరెస్టు చేసిన అడ్డగర్ల అజయకుమారి, ఇతరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెంటపాడు : నేతల నిర్బంధకాండను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం వద్ద ఆదివారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 20న చలో విజయవాడకు వెళ్లనున్న నేపథ్యంలో నేతలను పోలీస్ స్టేషన్‌కు పిలిచి నోటీసులివ్వడం సరికాదని తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమైన చర్య అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.మూడు వేల పారితోషికం ఇస్తున్నారని, నిత్యాసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని చాలీ చాలని జీతాలతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న చలో విజయవాడను ఆపేందుకు ప్రభుత్వం పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గ పాల్గొన్నారు.










