Jun 08,2023 20:58

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌ కృష్ణారెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి

         ప్రజాశక్తి-ఉరవకొండ   ఉరవకొండ మండల పరిధిలోని నింబగల్లు నుంచి ఉరవకొండ పట్టణానికి అదనపు తాగునీటి పైపులైను కోసం అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కోరారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌ కృష్ణారెడ్డిని గురువారం విజయవాడలో కార్యాలయంలో ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి భేటీ అయ్యి చర్చించారు. ఈ భేటీలో జిల్లాలోని జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం కింద మంజూరైన సిమెంట్‌ పైపులు దాదాపు 12 కిలోమీటర్ల మేర రోడ్డుకు పక్కన పడి ఉన్నాయన్నారు. ఆ పైపులను వినియోగించుకుంటే నింబగల్లు నుంచి ఉరవకొండకు అదనపు తాగునీటి పైపులైను కోసం ఏడు కిలోమీటర్ల మేర నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయవచ్చని సూచించారు. అంతేకాకుండా మిగిలిన పైపులను కూడా వై.టీ.చెరువు, ఇతర 17 గ్రామాలకు ఐదు కిలోమీటర్ల మేర వినియోగించి తాగునీటి సరఫరా చేయవచ్చని గతేడాది అనంతపురం ఆర్‌డబ్ల్యూఎస్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కావున ఇప్పటికైనా స్పందించి జిల్లాలోని గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లోని తాగునీటి సమస్యను పరిష్కరించచాలనికోరారు.
జెజెఎం నిధులు మంజూరు చేయండి..
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెజెఎం (జలజీవన్‌ మిషన్‌) పథకానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. నిధుల లేమితో ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమం నత్తనడకన నడుస్తోందన్నారు. అంతేగాకుండా గ్రామాల్లో గుత్తేదారులు ఇష్టానుసారంగా రహదారులకు ఇరువైపులా గుంతలు తీసి పెట్టారన్నారు. కొన్నిచోట్ల పైపులు వేసి వదిలేశారన్నారు. తద్వారా గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సమస్య పరిష్కరించాలని అడిగితే నిధులు మంజూరు కాలేదని సమాధానమిస్తున్నారన్నారు. కాబట్టి వెంటనే నిధులను మంజూరు చేసి సంబంధిత పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ కృష్ణారెడ్డి ఆయా ప్రాజెక్టులను వెంటనే చేపట్టడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.