Apr 09,2023 20:38

వాహనదారులు, ప్రజల అవస్థలు

ప్రజాశక్తి - ఉండి
పామర్రు నుంచి పాలకొల్లు వరకూ 165వ జాతీయ రహదారిలోని ఉండి రైల్వే గేట్‌ వద్ద నిర్మిస్తున్న ఆర్‌ఒబి పనులు ఏడు నెలలుగా నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 16 అక్టోబర్‌ 2020వ తేదీన ప్రతిష్టాత్మకంగా ఉండి కుర్మావారివీధి నుండి గోరింతోట వరకూ 1.35 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఆర్‌ఒబికి 90.99 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేశారు. ఈ ఆర్‌ఒబి నిర్మాణానికి సుమారు 600 కుటుంబాల వారిని ఖాళీ చేయించి వారికి ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం ఏమాత్రమూ సరిపోదని బహిరంగ మార్కెట్‌ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోకుండా ఖాళీ చేయించారు. అటువంటి ఆర్‌ఒబి పనులు కరోనా సమయంలో కూడా చురుగ్గా సాగాయి. తరువాత కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల మందకొడిగా సాగి ఇటీవల పూర్తిగా నిలిచిపోయాయి. గుడివాడ నుంచి నరసాపురం వరకూ డబుల్‌ రైల్వే లైను వేయడం వల్ల నరసాపురం నుండి వెళ్లే రైళ్ల సంఖ్య పెరుగుతుందని భావించిన ఈ ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఈ రైల్వే లైన్లో ఎక్కువ శాతం గూడ్స్‌, తక్కువ శాతం ప్రయాణికులు ఉపయోగించే రైళ్లు వెళ్లడంతో ప్రతి 20 నిమిషాలకోసారి రైల్వే గేట్‌ పడుతోంది. దీంతో ప్రయాణికులు ఎండలో సుమారు 20 నిమిషాల పాటు నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఒబి పనులు పూర్తయితే ఇన్ని అవస్థలు పడనవసరం లేదని అంటున్నారు. కేవలం గూడ్స్‌ రైళ్ల కోసమే డబుల్‌ రైల్వే లైన్‌ వేసారా అని వాహనదారులు వాపోతున్నారు. ఉండిలో 2020లో మొదలుపెట్టిన ఆర్‌ఒబి పనులు పూర్తి చేయకుండా ఆలపాడు వద్ద ఆర్‌ఒబి నిర్మాణం పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పట్లో ఆర్‌ఒబి పనులు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇంకెన్ని సంవత్సరాలు రైల్వే గేటు పడితే గంటల తరబడి ఎండలోనే నిలబడాలని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.