
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - సరుబుజ్జిలి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లు నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలు జీవితం గడపాల్సి ఉంటుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. సరుబుజ్జిలి మండల కేంద్రంలో రూ.61.80 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అడ్డంగా దొరికిపోయి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు బూటకపు యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 2018లో టిడిపి హయాంలోనే ఈ కేసు నమోదైందని తెలిపారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టిడిపి నాయకులు అంటున్నారని, అందరం అదే కోరుకుంటున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డిపై 18 కేసులు పెట్టి 18 నెలలు జైల్లో ఉంచారని, చివరికి రుజువు చేయలేక సిబిఐ కూడా చేతులెత్తేసిందన్నారు. కడిగిన ముత్యమంటే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు నిజాయతీపరుడైతే, నిజమే గెలవాలంటే ఆయన కేసులపై స్టేలను ఎత్తేసి బయటకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేయించలేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జిఎస్‌టి, సెబీ, ఇడి వంటి దర్యాప్తు సంస్థలు స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి చోటుచేసుకుందని చెప్పాక రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి కేసును అప్పగించిందన్నారు. చంద్రబాబు కేసుల్లో ఇరుక్కుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రముఖ న్యాయవాదులతో వాదించినా బయటకు రాలేకపోయారని చెప్పారు. భువనేశ్వరి కోరుకుంటున్నట్లు నిజమే గెలుస్తుందని, రానున్న రోజుల్లో ఒకటి తర్వాత ఒకటి వరుసగా వస్తాయన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి మద్దతిస్తుంటే, ఆయన దోస్త్ చంద్రబాబు నాయుడు అక్కడి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఓటుకు నోటు కేసులో తోడు దొంగ అయిన రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమ పథకాలు అందిస్తూ నిజాయితీగా పనిచేస్తున్న తాము ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. పవన్ కళ్యాణ్ కాదని, ఎంతమంది కళ్యాణ్‌లు వచ్చినా తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఎంతమంది వస్తారో రావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంవత్సరానికి 36 సార్లు పథకాలకు బటన్ నొక్కి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి ఆయన్ను గెలిపిస్తే, ప్రజలందరూ మళ్లీ ఐదేళ్లపాటు సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సురవరపు నాగేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, వైస్ ఎంపిపి గోవింద వెంకట శ్రీరామ్మూర్తి, వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బద్రి రామారావు, సర్పంచ్ బొడ్డేపల్లి వెంకట సూర్యచాందిని, వైసిపి నాయకులు ఎ.శ్రీకాంత్, బొడ్డేపల్లి హరి, పెద్ది రాజేష్, మూడడ్ల రమణ తదితరులు పాల్గొన్నారు.