Mar 17,2022 22:23

మాట్లాడుతున్న లక్ష్మినారాయణ


'రైతు సమ్మేళనం'లో రాష్ట్ర కన్వీనర్‌ లక్ష్మీనారాయణ
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
రైతు సమ్మేళనం రెండో రోజు గురువారం 'నదుల అనుసంధానం.. అంతరాష్ట్ర వివాదాలు' అంశంపై ప్రసంగించారు. కృష్ణా మిగులు జలాలను అంచనా వేసి మహారాష్ట్ర, కర్నాటకలకు కేటాయింపులు చేయడం వల్ల మిగులు జలాల ఆధారంగా రాయలసీమలో నిర్మాణం చేస్తున్న పెండింగ్‌ ప్రాజెక్టుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనానంతరం ఎగువ రాష్ట్రంగా మారినా తెలంగాణ శ్రీశైలం నుంచి ఎనిమిది వందల అడుగుల లోతు నుంచి నీటిని తరలించేందుకు అనుమతి లేకుండానే కష్ణా నదిపైన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుందని చెప్పారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచుకొని పలు ఎత్తిపోతల పథకాలను నిర్మించుకుంటుందని, తుంగభద్రలో భద్ర ఎగువ ప్రాజెక్టు, తుంగభద్ర గర్భంలో మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటుందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పలు కొత్త ప్రాజెక్టులు నిర్మించుకొని నీటిని వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కష్ణ, తుంగభద్ర నుంచి శ్రీశైలానికి నీరు రాకుండా ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించడం వల్ల శ్రీశైలం జలాలపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌ లో చేపడుతున్న తెలుగు గంగ, గాలేరు - నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పీడిత ప్రాంతాల్లో తాగు, సాగుకు నీరందకపోవడమే కాకుండా పరిశ్రమల నిర్మాణం కూడా జరగదని తెలిపారు. పర్యావసానంగా ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయి ఎడారిగా మారే ప్రమాదం ముంచుకొస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే నీటి సమస్యపై లోతైన అధ్యయనం చేయడంతో పాటు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఆధారంగా జలాలను వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల పరిరక్షణకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.