అనంతపురం కలెక్టరేట్ : వేసవిలో తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్ ఎం.గౌతమి గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు పీఏబీఆర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల శుద్ధి కేంద్రాలను తనిఖీ చేశారు. పీఏబీఆర్‌లో మరమ్మతులు చేసిన మోటర్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోటార్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలని, వేసవి సమయంలో అదనపు మోటర్లను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో ఇతర తాగునీటి పథకాలకు కేటాయించిన అదనపు మోటర్లను వినియోగించుకోవాలన్నారు. శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పీఏబీఆర్ డ్యామ్‌లో తలాపియా చేపల అభివద్ధి కోసం మత్స్యశాఖ పరిధిలో చేపట్టాల్సిన నిర్మాణాలకు అంచనా వ్యయాలు పంపించాలని హెచ్చెల్సీ అధికారులను ఆదేశించారు. కూడేరు ఎంపీపీ నారాయణ రెడ్డి విజ్ఞప్తి మేరకు పీఏబీఆర్ కుడి కాలవ వద్ద పార్కు నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎహసాన్ బాషా, కూడేరు ఎంపీపీ నారాయణ రెడ్డి, కాంట్రాక్టర్ హరినాథ రెడ్డి, సత్యసాయి ప్రాజెక్టు డీఈ రామారావు, ఏఈ భార్గవ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్, హెచ్చెల్సీ ఈఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.










