Sep 16,2023 23:04

దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న గౌతు శివాజీ

* మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ
ప్రజాశక్తి - పలాస: 
నీచ రాజకీయాలకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారని మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ విమర్శించారు. అందులో భాగంగానే రిలే నిరాహార దీక్షను పోలీసులను అడ్డం పెట్టుకుని భగం చేయించారని ధ్వజమెత్తారు. కాశీబుగ్గలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్‌ స్థలంలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతుంటే మంత్రి అప్పలరాజు చిన్న ఫోన్‌ కాల్‌తో పోలీసులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏం జరిగిందో కాల్‌ డేటా దమ్ముంటే బయట పెట్టగలరా అని ప్రశ్నించారు. మంత్రి అరాచకానికి పోలీసులు వత్తాసు పలుకుతూ వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. తనను అరెస్టు చేసి ఎక్కడకు తీసుకెళ్తున్నారో తనకే చెప్పలేదని, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదన్నారు. రహస్యంగా తీసుకు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందో చెప్పాలన్నారు. ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను నిలదీస్తే ఉన్నతాధికారుల ఆదేశాలని ముక్తసరిగా చెప్పారన్నారు. ఐపిఎస్‌, గ్రూప్‌-1 స్థాయి అధికారులు శిక్షణ పొంది నీచ రాజకీయాలు చేస్తున్న వారికి అండగా నిలవడానికా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో శివాజీ సతీమణి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబురావు పాల్గొన్నారు.
నాలుగో రోజు దీక్షలు
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యాన నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శివాజీ సతీమణి విజయలక్ష్మి మందస మండల టిడిపి నాయకులు కార్యకర్తలకు నల్ల కండువాలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతు శివాజీ, గౌతు శిరీష మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. అనంతరం గౌతు శిరీష దీక్ష చేపట్టిన వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, మందస మండల అధ్యక్షులు బావన దుర్యోధన, జిల్లా అధికార ప్రతినిధి దాసరి తాతారావు, మండల ప్రధాన కార్యదర్శి లబ్బ రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గౌతు శివాజీ