నిబంధనల ప్రకారమే అనుమతుల మంజూరు : కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పట్టణ ప్రణాళిక విభాగం సంబంధించి ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారమే అనుమతులు మంజూరు చేయాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో.. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... నివాస, ఇతర భవన నిర్మాణాల కోసం అందే దరఖాస్తులను నిబంధనల మేరకు వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణాల విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. నగరపాలక పరిధిలో అనధికార నిర్మాణాలకు తొలిదశలోనే అడ్డుకట్ట వేయాలని, సకాలంలో నోటీసులు అందించాలన్నారు. అక్రమ, అనధికార నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పూర్తి చేయాలన్నారు. నగరంలో అనధికార ఫ్లెక్సీలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు వద్ద ఏర్పాటు చేసిన నేమ్ బోర్డుల పన్నుల వసూలు చేయాలన్నారు. ఈసమావేశంలో ఏసీపీ రామకష్ణుడు, టీవీఎస్ శారద, ఇతర అధికారులు పాల్గొన్నారు.










