ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే అధికారులు నిబంధనలకు లోబడే దుకాణాలపై దాడులు నిర్వహించారని మేయర్ మొహమ్మద్ వసీం స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారుల పట్ల బిజెపి నేతలు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. ప్లాస్టిక్ క్యాన్సర్ కంటే ప్రమాదకరమని స్వయానా దేశ ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే వ్యాపారులు ఉన్నఫలంగా బ్యాన్ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని, తమ వద్ద ఉన్న స్టాక్ అయిపోయే వరకైనా గడువు ఇవ్వాలని కొరారన్నారు. పలుమార్లు గడువు పెంచినా దుకాణదారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతోనే పొల్యూషన్ బోర్డు శాఖ అధికారులకు సమాచారమిచ్చి వారి నిబంధన మేరకే దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అయితే వాస్తవాలను వక్రీకరిస్తూ బిజెపి నేతలు ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. నగరంలో ఏ వ్యాపారికీ, ఏవర్గానికి అధికారులు వ్యతిరేకం కాదన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించినప్పుడే నగరాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు శ్రీనివాసులు, కమల్‌భూషణ్, బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న మేయర్ మొహమ్మద్ వసీం










