Sep 21,2023 22:19

నగరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ -2లో భాగంగా స్వచ్ఛతా హీ సేవాకార్యక్రమాలు విస్తతంగా జరుగుతున్నాయని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. బుధవారం రాత్రి కట్టమంచి వినాయక నిమజ్జనం కేంద్రం వద్ద 'గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌' కార్యక్రమాన్ని కమిషనర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా సామగ్రిని అక్కడికక్కడే సేకరించి తరలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచారు. భక్తులకు ఇచ్చే ప్రసాదాలకు ఆకులతో చేసిన కప్పులను వినియోగించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, పౌరుల బాధ్యతపై కమిషనర్‌ అరుణ అవగాహన కల్పించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే యువతను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమం, పార్కులను శుభ్రం చేయడం, 2కే రన్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈ గోమతి, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ లోకేష్‌, డీఈలు వెంకట ప్రసాద్‌, రమణ, సానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు, నగరపాలక సంస్థ కార్మికులు పాల్గొన్నారు.