నగరిలో ఉద్రిక్తత
జాతీయ రహదారి దిగ్బంధం
వేలాదిగా కదిలొచ్చిన పవర్ లూమ్ కార్మికులు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
అత్తెసరు కూలీతో అవస్థ పడుతున్న పవర్లూమ్ కార్మికులు కన్నెర్ర చేశారు. వారం రోజులుగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నా, పట్టించుకోని అధికారుల నిర్లక్ష్య వైఖరిపై పిడికిలి బిగించారు. నగరి తమిళనాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని తెగేసి చెప్పారు. మూడు గంటల పాటు జాతీయ రహదారిని ఆపేశారు. పోలీసులు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆఖరుకు మాస్టర్ వీవర్లతో శుక్రవారం చర్చలు జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
నగరిలో మాస్టర్ వీవర్లు పవర్లూమ్ కార్మికులకు కూలిరేట్లు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈపోరాటంపై కలెక్టర్ జోక్యం చేసుకొని పవర్లూమ్ కార్మికులతో చర్చలు జరపాలని ఆర్డీవోను ఆదేశించారు. అయితే దీనిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కడుపు మండి పవర్ఫుల్ కార్మికులు బుధవారం వేలాది మందితో నేషనల్ హైవేని దిగ్బంధించారు. సిఐటియు జెండాలు చేతపట్టుకొని కూలి ఇప్పించండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, ప్రధాన కార్యదర్శి పి.చైతన్యలను బలవంతంగా అరెస్టు చేయడానికి సిద్దమైనారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కార్మికులు ఓవైపు పోలీసులు మరోవైపు లాక్కెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ పెనుగులాటలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు ఎడమచేతికి స్వల్ప గాయమైంది. రాస్తారోకో వల్ల జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి.
ఈ భారీ రాస్తారోకో నుద్దేశించి నాయకులు మాట్లాడుతూ కూలీ రేట్లను పెంచాలని కోరుతూ రోజుకో విధంగా వంటావార్పులు, అర్ధనగ ప్రదర్శన, బిక్షాటన ఇలా రకరకాలుగా చేసినా, మరమగ్గ కార్మికులపై అధికారుల స్పందన దారుణం అన్నారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఇస్తున్న విధంగా కూలి రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న కూలిరేట్లు గత పది సంవత్సరాల ముందు నుండి ఇచ్చే రేట్లు మాత్రమేనని అప్పటి నుంచి అనేక రేట్లు నిత్యావసర వస్తువులపై భారీస్థాయిలో రేట్లు పెరిగాయన్నారు. మరి వాటికి తగ్గట్టు కూలిరేట్లు ఉండాలని డిమాండు చేశారు. ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగుచెందిన కార్మికులు రోడ్డెక్కారని చెప్పారు. ప్రభుత్వమే దీనికి భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే కూలి రేట్లు పెంచాలని, తమ పోరాటం విజయవంతం అయ్యేంతవరకు ధర్నా విరమించేది లేదని తెలిపారు.
చివరకు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ..
నగరి ఆర్డిఓతో చర్చలకు మాస్టర్ వీవర్స్, మరమగ్గ కార్మికులు ఒప్పుకోవడంతో ధర్నా విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో పవర్ లూం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్, జగదీష్, సిఐటియు నాయకులు వెంకటేష్ లతో పాటు రెండు వేల మంది కార్మికులు పాల్గొన్నారు.










