Feb 25,2022 23:10

ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి సతీమణి శ్రీవాణిరెడ్డి, కుమారుడు ఆకర్ష్‌రెడ్డి

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణం నేత్రపర్వంగా సాగింది. పాల సముద్రాన్ని చిలికిన సందర్భంగా వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడు మగత నిద్రలోకి వెళ్లిపోతాడు. ఆయన్ను మేల్కొల్పడానికి దేవతలు చేసే ఉత్సవాన్ని ధ్వజారోహణం అంటారు. దీనినే దేవరాత్రి అని కూడా పిలుస్తారు. ఆలయంలోని స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద ఆలయ పండితులు, పురోహితుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సంకల్ప పూజలు ప్రారంభించారు. అనంతరం స్వామీ అమ్మవార్ల ప్రధాన మూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు కంకణధారణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఇంద్రాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురాదులు, సమస్త భేరి, ధ్వజదేవతల ఆవాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు చీరలను సమర్పించారు. దీనినే కొడి కట్టడం అంటారు. దీంతో ప్రధాన ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి సతీమణి శ్రీవాణిరెడ్డి, కుమార్తె శ్రీపవిత్రారెడ్డి, కుమారుడు ఆకర్ష్‌రెడ్డి, అంజూరు శ్రీనివాసులు, ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
మీడియా కేంద్రం ప్రారంభం
స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయ పీఆర్వో కార్యాలయంలో శుక్రవారం మీడియూ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ప్రారంభించారు.
నేటి నుంచి వాహన సేవలు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నుంచి పార్వతీపరమేశ్వరుల వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ వాహనాలపై ఆదిదంపతులను ఊరేగించడానికి భక్తులు పోటీ పడు తుంటారు. శివపార్వతుల ఉత్సవమూర్తులు అశ్వ, హంస, గజ, నంది, సింహ, శుక, కామధేనువు, అధికారనంది, రావణబ్రహ్మ, భూత వాహనాలపై ఊరేగించడం ఆనవాయితీ. ఈ మేరకు ఆలయాధికారులు ఉత్సవ మూర్తుల వాహనాలు సిద్ధం చేశారు. వాహనాల న్నింటికి బంగారు పూత వేయడంతో ఆదిదంపతులు ఊరేగింపు కార్యక్రమాలు భక్తులకు ఆనందాన్ని కల్గించనున్నాయి.
స్వామి వారి ధ్వజారోహణం సందర్భంగా కొడి కడుతున్న దృశ్యం