
* జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి
ప్రజాశక్తి - శ్రీకాకుళం: నేత్రదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని తద్వారా అంధత్వాన్ని రూపుమాపవచ్చని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి దాతలకు పిలుపునిచ్చారు. ఒకరి నేత్రదానంతో ఇద్దరికి జీవిత కాలపు వెలుగును ప్రసాదించవచ్చని స్పష్టం చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యాన గత నెల 25 నుంచి నిర్వహించిన 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు ర్యాలీని జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. మగటపల్లి కళ్యాణ్ ఐ కలెక్షన్ సెంటర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, జెసిఐ నిర్వహించిన ర్యాలీ అనంతరం ఏడు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధత్వంతో బాధపడుతున్న చిన్నారులకు దాతలు అందించే నేత్రాలు వారి జీవితాల్లో వెలుగును నింపుతుందన్నారు. నేత్రదానం అంటే చాలా మందిలో అపోహ ఉందని, మరణించిన వ్యక్తి నుంచి కార్నియాను మాత్రమే సేకరించి అంధులకు అమర్చడం ద్వారా ఇద్దరికి కంటిచూపును ప్రసాదించవచ్చని వివరించారు. తమ నేత్రాలను దానం చేయాలనుకునే వారు సమీప ప్రభుత్వాస్పత్రిలో లభించే నేత్రదాన ప్రతిజ్ఞా పత్రంలో తమ పేరు, వివరాలను నింపి అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ త్రినాథరావు, రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కంటి విభాగాధిపతి నిర్మల్ జ్యోతి, పారామెడికల్ ఆప్తాలమిక్ అధికారులు, ఆశావర్కర్లు, సామాజిక కార్యకర్త మంత్రి వెంకటస్వామి, పెంకి చైతన్య తదితరులు పాల్గొన్నారు.