
* బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సూర్యారావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: నవంబరు 1 నుంచి 3 వరకు కోర్టు విధులను బహిష్కరించనున్నట్టు బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, న్యాయశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్ని సూర్యారావు తెలిపారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ భవనంలో మంగళవారం న్యాయవాదులతో సమావేశం నిర్వహించి తీర్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పిటిషన్లపై రూ.20 వెల్ఫేర్ స్టాంప్‌ని అంటించాలని చేసిన అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ చట్ట సవరణను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న రూ.వంద వెల్ఫేర్ ఫండ్ స్టాంపును రూ.250 పెంచారని అన్నారు. ఈ రెండు తీర్మానాల చట్ట సవరణ జరిగే వరకు అన్ని పిటిషన్లపై రూ.20 వెల్ఫేర్ ఫండ్ స్టాంప్‌ను అంటించడం యథావిథిగా కొనసాగుతుందని చెప్పారు. కొన్ని కోర్టుల్లో కాఫీ ఆఫ్ అప్లికేషన్స్‌పై, మెమోలపైనా రూ.20 వెల్ఫేర్ స్టాంపు అంటించమని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు ఇస్తున్న డెత్ బెనిఫిట్‌ను రూ.4 నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు వైద్య ఖర్చుల నిమిత్తం వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇస్తున్న ఫైనాన్షియల్ అసిస్టెంన్స్‌ను రూ.50 నుంచి రూ.లక్షకు పెంచాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి పొన్నాడ రాము, ఉపాధ్యక్షులు చంద్రమౌళి, స్పోర్ట్స్ సెక్రటరీ గంగు భాస్కరరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఆమదాలవలస : కోర్టు పిటీషన్లు అన్నింటిపై రూ.20 విలువ గల వెల్ఫేర్ స్టాంపును అతికించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అమరావతి తీసుకున్న నిర్ణయంపై బార్ అసోసియేషన్ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి ఆధ్వర్యాన న్యాయవాదులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ న్యాయవాదుల హక్కులు కాలరాస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఎవరూ రూ.20 విలువ గల వెల్ఫేర్ స్టాంప్‌ను ఎటువంటి పిటిషన్లపైనా అతికించవద్దని పిలుపునిచ్చారు. న్యాయవాదుల హక్కులను కాలరాస్తూ తీసుకున్న నిర్ణయంపై ఈ నెల 3 వరకు విధులను బహిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పైడి వరహానరసింహం, తమ్మినేని అన్నంనాయుడు, బొడ్డేపల్లి మోహనరావు, హనుమంతు ప్రసాదరావు, వాడవలస రాజేశ్వరరావు, గురుగుబెల్లి ప్రభాకరరావు, బూర్లె సీతారాం, అన్నెపు సత్యం పాల్గొన్నారు.