అనంతపురం కలెక్టరేట్ : సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు అనంతపురం తపోవనం సర్కిల్‌లోని జిపిఆర్ ఫంక్షన్ హాల్‌లో సమావేశాలు జరగనున్నాయి. 12వ తేదీ రాష్ట్ర కార్యదర్శివర్గం, 13, 14న రాష్ట్ర కమిటీ సభ్యులు ఇందులో పాల్గొంటారు. 12వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు జెడ్పీ హాల్లో 'వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి- కేరళ ప్రభుత్వ నమూనా' అనే అంశంపై కేరళ మాజీ మంత్రి ఎంఏ.బేబితో చర్చావేదిక జరగనుంది. 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ వద్ద బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఇందులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఎంఎ.బేబి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ ఎంఎల్‌ఎ ఎంఎ.గఫూర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూర్తి చేశారు.
సమావేశాలను జయప్రదం చేయాలని స్కూటర్ ర్యాలీలు
అనంతపరంలో మూడు రోజల పాటు నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం నాడు జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం సిపిఎం నగర 1,2వ కమిటీల ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీని నిర్వహించారు. ఇందిరానగర్‌లోని గణేనాయక్ భవన్ సిపిఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన స్కూటర్ ర్యాలీ తపోవనం సర్కిల్, రుద్రంపేట సర్కిల్, సప్తగిరి సర్కిల్, శ్రీ కంఠం సర్కిల్, పాతూరు మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర 2వ కమిటీ కార్యదర్శి ఆర్‌వి.నాయుడు మాట్లాడుతూ 12, 13, 14వ తేదీల్లో సమావేశాలకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేరళ మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ.బేబీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యులు మధు, మాజీ ఎమ్మెల్యే గఫూర్, తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరుగుతుందన్నారు. భవిష్యత్తు పోరాటాలకు దిశనిర్ధేశం చేస్తారన్నారు. సమావేశాల సందర్భంగా 12న నిర్వహించే చర్చావేదిక, 13న జరిగే బహిరంగ సభల్లో మేధావులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ముస్కిన్, వలి, ప్రకాష్, ఉప సర్పంచ్ మసూద్, సిపిఎం 2వ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, ముత్తుజ, ఏటీఎం నాగరాజు, నగర కమిటీ సభ్యులు బాబు, వెంకటేష్, జీవా, ప్రసాద్, రాజు, రామాంజనేయులు, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ, ఎర్రిస్వామి, అభ్యుదయ కాలనీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.










