
ప్రజాశక్తి - కోటబొమ్మాళి : కొత్తమ్మతల్లి ఉత్సవాలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు 19వ తేదీతో ముగియనున్నాయి. ప్రతిఏటా ఈ ఉత్సవాలు మహాలయ అమావాస్య తర్వాత వచ్చే గురువారం నాడు ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంతవాసులే కాకుండా తెలంగాణ, ఒడిశా నుంచి యాత్రికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన బోయిన మాధవి కృష్ణారావు, ధర్మకర్తలి మండలి వైస్ చైర్మన్ బి.నాగేశ్వరరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ, సర్పంచ్ కాళ్ల సంజీవరావు తదితరుల పర్యవేక్షణలో ఏర్పాట్లను పూర్తి చేశారు. కోటబొమ్మాళి మెయిన్ రోడ్డులో ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి రెండు కిలోమీటర్ల పొడవునా కొత్తపేట వరకు విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. లైటింగ్‌తో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి, కొత్తమ్మ తల్లి భారీ కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జెయింట్ వీల్, శాలంబో, బ్రేక్ డాన్స్, కారు, మోటార్ సైకిల్ విన్యాసాలు ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. దర్శనాలకు వచ్చే వారికి ఉచిత ప్రసాదం, భోజన ఏర్పాట్లను చేస్తున్నారు. యాత్రికుల సౌకర్యార్థం ఆర్‌టిసి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. ఉత్సవాల సందర్భంగా సంగిడీరాళ్లు, ఈడుపురాయి, ఉలవల బస్తాల పోటీలు మంగళ, బుధవారాల్లో నిర్వహించనున్నారు. పగటి వేషాలు, కోయ నృత్యాలతో పాటు మూడు రాత్రులు పలు పౌరాణిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
జాతరకు భారీ బందోబస్తు
మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. టెక్కలి సిఐ సూర్య చంద్రమౌళి ఆధ్వర్యాన సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు. ఎవరైనా ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా 9440795835, 08942 238633 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.