Sep 14,2023 21:37

నూతన పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

        ప్రజాశక్తి-అనంతపురం   ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా నేటి నుంచి ప్రారంభం కానున్న 'జగనన్న ఆరోగ్య సురక్ష' ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం 1, 2, 3 సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 30 వతేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేసి వైద్యసేవలు అవసరమైన వారిని గుర్తించాలని తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి 30వతేదీ వరకూ అన్ని సచివాలయాల పరిధిలో మెడికల్‌ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాల్లో 14రకాల వైద్యసేవలు అందించి 105 రకాల మందులను ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షల తర్వాత అవసరమైతే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు వైద్య చికిత్స నిమిత్తం తరలించాలన్నారు. తర్వాత ఆయా సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్షించారు. రోడ్లు, డ్రెయినేజీల సమస్యలు ఎక్కడా లేకుండా చూడాలన్నారు. అంతకుముందు పంచాయతీ పరిధిలో కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్‌ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసిలు నాగేంద్ర, శృతి, మహబూబ్‌జాన్‌, వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, వైసిపి నేతలు బి.మదన్‌మోహన్‌రెడ్డి, హాజీవలి, సత్తెన్న, బషీర్‌, గువ్వల రామకృష్ణారెడ్డి, బీవీ.సుబ్బారెడ్డి, పుల్లారెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.