Mar 14,2023 20:47

అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్‌ ప్రశాంతిపరీక్షలు
ప్రజాశక్తి - భీమవరం
ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై స్థానిక కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఇంటర్‌, ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తారన్నారు. ఇంటర్‌ పరీక్ష ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఎస్‌ఎస్‌సి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి 11.45 గంటల వరకూ నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షలకు నిర్థారించిన సమయం మించి నిమిషం ఆలస్యంగా వస్తే పరీక్షకు అనుమతించబోరని స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్లు, పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది కూడా స్మార్ట్‌ఫోన్లను తీసుకురాకూడదని, కేవలం చీఫ్‌ ఇన్విజిలేటర్‌ వద్ద మాత్రమే ఫీచర్‌ ఫోన్‌ను అనుమతిస్తారని తెలిపారు. విద్యార్థినుల వద్ద సెల్‌ఫోన్లు తనిఖీ చేసేందుకు పరీక్షా కేంద్రాల వద్ద మహిళా పోలీసులను నియమించాలన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ విధిస్తారని, పరిసరాల్లో జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్‌నెట్‌ సెంటర్లు పరీక్షల సమయంలో మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇంటర్‌ పరీక్షలకు 52 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేశామని కలెక్టర్‌ ప్రశాంతి చెప్పారు. జిల్లాలో 52 ఇంటర్‌ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఫస్టియర్‌ పరీక్షలకు 18,352 మంది, సెకండియర్‌ పరీక్షలకు 17,435 మంది మొత్తం 35,787 మంది హాజరుకానున్నారని చెప్పారు. 52 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్టుమెంట్‌ ఆఫీసర్స్‌, 955 మంది ఇన్విజిలేటర్లు, ఐదు ఫ్లయింగ్‌ స్కాడ్లు ఏర్పాటు చేశామన్నారు.
పదో తరగతి పరీక్షలకు 121 కేంద్రాలు
పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేశామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 24,586 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. 22 స్టోరేజ్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని, 121 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 24 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. ఈ సమా వేశంలో డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, ఎఎస్‌పి ఎవి.సుబ్బరాజు, డిఇఒ ఆర్‌.వెంకటరమణ, డిఐఇఒ కెవి.సత్యనారాయణ, అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.
ఇంటర్‌ పరీక్షలకు సర్వం సన్నద్ధం
ఆకివీడు :మండలంలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కేంద్రాలు సిద్ధమయ్యాయి. మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యా వికాస్‌, కార్తికేయ, దుంపగడప ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో పరీక్షలు నిర్వహించే మూడు కళాశాల విద్యార్థులతో పాటు స్థానిక వాసవి శారద జూనియర్‌ కళాశాల, ఇమ్మానుయేలు ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామంలో బాలజ్యోతి జూనియర్‌ కళాశాల కాళ్ల గ్రామంలోని జగన్‌ సాయి జూనియర్‌ కళాశాలకు చెందిన ఏడు కళాశాలల్లో సుమారు 1600 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 850 మంది జూనియర్‌ ఇంటర్‌, 750 మంది సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సుమారు 60 మంది ఇన్విజిలేటర్లతో పాటు ప్రత్యేక పరీక్షా నిర్వాహకులుగా డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్స్‌ నిర్వహిస్తున్నారు. ఆయా కళాశాల వద్ద 144 సెక్షన్‌ విధించినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
పాలకొల్లు:పట్టణంలోని 7 కేంద్రాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించి అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కోకోనట్‌ మర్చంట్స్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆదిత్య జూనియర్‌ కళాశాల, కెవిఎం ఛాంబర్స్‌ జూనియర్‌ కళాశాల, గౌతమి జూనియర్‌ కళాశాల, శ్రీ చైతన్య జూనియర్‌, కళాశాల, సబిత జూనియర్‌ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పట్టణంలో 2 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను, అధికారులను ఇన్విజిలేటర్లుగా నియమించారు.