అనంతపురం క్రైం : గతాన్ని వదిలేసి నేరాలకు పూర్తిగా స్వస్తి పలికి జీవించాలని రౌడీషీటర్లు, హత్య కేసుల్లో నిందితులకు ఎస్పీ కె.శ్రీనివాసరావు సూచించారు. జిల్లాలోని కిరాయి హంతకులు, రౌడీషీటర్లు, హత్య కేసుల్లో నిందితులు, గంజాయి స్మగ్లర్స్ తదితరులకు శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వారితో మాట్లాడుతూ గత నేర చరిత్రను పూర్తిగా వదిలేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి ప్రమాదకారి పదార్థాన్ని తీసుకోవడంలో ఆరోగ్యం క్షీణించడం, మరణాలు సంభవించడం మరియు జీవితాలు నాశనమవుతాయని గుర్తించాలన్నారు. హత్యలు, దోపిడీలు, రౌడీయిజం లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. నేరప్రవృత్తిలో పాత పంథా మళ్లీ పునరావతమైతే పీడీ యాక్టు, జిల్లా బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, డీఎస్పీలు జి.ప్రసాదరెడ్డి, బి.శివారెడ్డి, వి.శ్రీనివాసులుతో పాటు పలువురు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










