పుట్టపర్తి రూరల్ : జిల్లాలో నేరాల నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకోవాలని అనంతపురం రేంజ్ డిఐజి ఆర్‌ఎస్.అమ్మిరెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. సత్యసాయి జిల్లా నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ మాధవరెడ్డితో కలిసి మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి స్టేషన్‌లో ప్రతిరోజు విజిబుల్ పోలింగ్ నిర్వహించాలని, స్టేషన్ పరిధిలోని మహిళా పోలీసులు, విలేజ్ పోలీస్ ఆఫీసర్‌తో కలిసి కాఫీవిత్ ఉమెన్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తద్వారా గ్రామాల్లో నెలకొన్న విషయాలపై పూర్తి సమాచారం స్టేషన్ అధికారి దష్టికి వస్తుందని చెప్పారు. జిల్లాలోని రహదారులపై గల బ్లాక్‌స్పాట్లను గుర్తించి ఆయా ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాహన తనిఖీలను చేపట్టాలన్నారు. ఫోక్సో కేసుల్లో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. అక్రమ మద్యం, నాటుసారా, గుట్కా, గాంబ్లింగ్, మొదలైన వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సంఘ విద్రోహ చర్యలు పాల్పడే వారిపై కఠినంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు నియంత్రణ జరిగేలా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సున్నితమైన భాషతో మాట్లాడాలన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మహిళ పోలీసులకు జ్ఞాపికలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.విష్ణు తో పాటు జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










