Sep 26,2023 22:03

సోంపేట : అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎస్‌పి రాధిక

* ఎస్‌పి జి.ఆర్‌ రాధిక
ప్రజాశక్తి - పలాస, సోంపేట: 
నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కాశీబుగ్గ డిఎస్‌పి కార్యాలయాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ నమోదయ్యే కేసుల వివరాలను నమోదు చేయాలన్నారు. కార్యాలయ రికార్డులను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించాలని చెప్పారు. కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ పరిధిలో అనేక అసాంఘిక చర్యలకు అవకాశాలున్నాయని, వాటిపై సిబ్బంది దృష్టిసారించాలన్నారు. ఒడిశా సరిహద్దు సమీపంలో ఉండడంతో నేరాలు పెరిగే ఆస్కారముందన్నారు. గుట్కా, ఖైనీ, గంజాయి దిగుమతులపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అబ్దుల్‌ కలాం విగ్రహావిష్కరణ
సోంపేట పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆవిష్కరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సోంపేట సర్కిల్‌ కార్యాలయాన్ని ఆమె పరిశీలించి స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని, సైబర్‌ నేరాలు, చైన్‌ స్నాచింగ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట డిఎస్‌పి నాగేశ్వర్‌ రెడ్డి, సిఐ శంకరరావు, రవిప్రసాద్‌, ఎస్‌ఐ హైమావతి, సిబ్బంది ఉన్నారు.
పలాస : రికార్డులను పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక