May 15,2023 21:15

రాయదుర్గం పట్టణంలో ప్రధాన రహదారిలో సెల్ఫీ ఛాలెంజ్‌ వీడియోను ప్రదర్శిస్తున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

          ప్రజాశక్తి-రాయదుర్గం  రాయదుర్గం ప్రజల పాతికేళ్ల కల అయిన పట్టణ రహదారి విస్తరణను నేనే చేశానని, నీవేం చేశామో చెప్పాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా టిడిపి హయాంలో నిర్మించిన పట్టణ ప్రధాన రోడ్డు విస్తరణపై సోమవారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం దాదాపు మూడు దశాబ్ధాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అయితే తాను ఎమ్మెల్యేను అయ్యాక ప్రజల కోరిక మేరకు రూ.13కోట్లతో రహదారిని విస్తరించామన్నారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు పోగొట్టుకున్న వ్యాపారస్తులతో మూడు దఫాలుగా చర్చించి వారి నిండు మనసుతో పని పూర్తి చేశామన్నారు. వచ్చే 50 ఏళ్ల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్లై ఓవర్లు, కరెంటు ట్రాన్స్‌ఫార్మర్లు, ఎల్‌ఇడి లైట్లు తదితర సౌకర్యాలను కల్పించామన్నారు. అయితే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామచంద్రారెడ్డి ప్రజలకు గుర్తుండే శాశ్వతమైన పని ఒక్కటైనా చేశాడా అని నిలదీశారు. తాను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి ఉంటే, పట్టణ శివార్లలో ఉడేగోళం క్రాస్‌ నుంచి బళ్లారి రోడ్డు వరకూ రూ.42 కోట్లతో హాఫ్‌ రింగ్‌ రోడ్డు పనులు పూర్తి చేసే వాడినన్నారు. అసమర్థ ఎమ్మెల్యే కాపు హయాంలో పట్టణం ఇసుమంతైనా అభివృద్ధి చెందలేదన్నారు. ప్రగతి ఫలాలను ప్రజలకు అందించలేని 'కాపు'నకు శాసన సభ్యుడిగా ఉండే అర్హత లేదన్నారు.