
ప్రజాశక్తి - మందస: యుటిఎఫ్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ప్రచార యాత్రను ఈనెల 21న ఇచ్ఛాపురం నుంచి ప్రారంభిస్తున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్.కిషోర్ కుమార్ తెలిపారు. మండలంలోని హరిపురంలో బైక్ జాతా సన్నాహక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండు జాతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి జాతా ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకు రెండో జాతా హిందూపురం నుంచి విజయవాడ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురంలో యాత్ర ప్రారంభమై జిల్లాలో సోంపేట, హరిపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం వరకు సాగుతుందన్నారు. ఈనెల 29వ తేదీకి విజయవాడ చేరుకుంటుందని చెప్పారు. అక్టోబర్ ఒకటో తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1974లో ఆవిర్భవించిన యుటిఎఫ్ ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా పనిచేస్తోందన్నారు. స్వర్ణోత్సవ సంబరాలను అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ గుంట కోదండరావు, అకడమిక్ సెల్ కో-కన్వీనర్ గున్న రమేష్, సిపిఎస్ కన్వీనర్ దాసరి ఈశ్వరరావు, పిన్నింటి కొండలరావు, కంచరాన మాధవరావు, జన్ని సోమేశ్వరరావు, గున్న చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.