డీఈఓ కార్యాలయం ఎదుట
నేడు ఫ్యాప్టో ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో చిత్తూరు జిల్లా సభ్యసంఘాల సమావేశం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్రంలో 26 జిల్లాల కలెక్టరేట్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టాలని, దీంట్లో భాగంగా చిత్తూరు జిల్లా డిఇఒ కార్యాలయం వద్ద చేపట్టే నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐఖ్య కార్యచరణ సమితి (ఫ్యాప్టో) పిలుపునిచ్చింది. విభజన జిల్లాల ప్రకారం 31మండలాల నుండి అధిక సంఖ్యలో ఉపాద్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాపో నేతలు పిలుపునిచ్చారు. విద్యారంగాన్ని నష్టపరిచే జీఓ. నం.117ను రద్దు, 2,3,4,5 తరగతుల విలీనాన్ని నిలుపుదల, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పాఠశాల విద్యలో తెలుగు, ఇంగ్లీషు మీడియం రెండింటిని కొనసాగింపు, 3వ తరగతి నుండి సబ్జెక్ట్ టీచర్లతో బోధన జరిపిస్తామన్న ప్రభుత్వహామీ నెరవేరాలంటే ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయుల వర్క్ లోడ్ 32 పీరియడ్లకు మించరాదని, మైనర్ మీడియం స్కూల్స్ ఇతర మీడియం హైస్కూల్స్లో విలీనం చేయరాదనే ప్రధాన సమస్యల పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ఫ్యాప్టో నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు యుటిఎఫ్ జివి.రమణ, పి.సుధాకర్‌రెడ్డి, ఎస్‌టియు గంటా మోహన్, దేవరాజులరెడ్డి, ఏపిటిఎఫ్-1938 కిరణ్, చిట్టిబాబు, ఎపిటిఎఫ్-257 చంద్రశేఖర్ నాయుడు, హెచ్‌ఎంఎ తులసీబాబు, పీఈటీ అసోసియేషన్ రవి, ఎస్‌ఎఎ నరోత్తమ రెడ్డి, ఎస్పీ బాష, భానుప్రకాష్, గణేష్, రాజేష్, ఎస్‌కె.మోహన్, పరందామ తదితరులు పాల్గొన్నారు.










