Oct 26,2023 21:38

మాట్లాడుతున్న డిఆర్‌ఒ గణపతిరావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో ఓటరు జాబితా ముసాయిదాను ఈనెల 27న ప్రచురించనున్నామని, వాటిలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్‌లోని డిఆర్‌ఒ ఛాంబరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలను ప్రతిఒక్కరూ పరిశీలించుకోవాలని వాటిలో తొలగింపులు, చేర్పులు వంటి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. ఫారం-6, 7, 8 ద్వారా వాటిని సరిచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ముసాయిదాలోని క్లయిమ్‌లు, అభ్యంతరాలను 27 నుంచి డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు స్వీకరించనున్నట్లు చెప్పారు. డిసెంబరు 26 నాటికి వాటిని పరిష్కరిస్తామని, జనవరి ఐదో తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని, ఆయా తేదీలను ముందుగా ప్రకటిస్తామని తెలిపారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి తప్పుడు ఫారం-7 అందజేస్తే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్యాలెట్‌ యూనిట్లు 7,530, కంట్రోల్‌ యూనిట్లు 5,850, వివి ప్యాట్‌లు 7070 జిల్లాకు చేరాయని చెప్పారు. మొదటి దశ తనిఖీల ప్రకారం 7,523 బ్యాలెట్‌ యూనిట్లకు గానూ 2,440, 5,831 కంట్రోల్‌ యూనిట్లకు గానూ 2020, 7,105 వివి ప్యాట్లకు గానూ 2,300 పూర్తిగా పనిచేసున్నాయని తెలిపారు. బ్యాలెట్‌ యూనిట్లు 4, కంట్రోల్‌ యూనిట్లు 8, వివి ప్యాట్లు 24 తిరస్కరించామన్నారు. ఇవిఎంల వినియోగంలో ఎటువంటి అపోహలు ఉన్నా నిపుణులు నివృత్తి చేస్తారని తెలిపారు. సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, కాంగ్రెస్‌ నాయకులు డి.గోవింద మల్లిబాబు, సిపిఎం నాయకులు డి.గోవిందరావు, భవిరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.