Jul 31,2022 21:36

నేడు - నేడుతో పాఠశాల రూపురేఖల్లో మార్పు
ప్రభుత్వ బడులపై పెరుగుతున్న ఆసక్తి : సమగ్రశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ వెంకట రమణారెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నాడు- నేడుతో చిత్తూరు, తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ బడుల రూపురేఖల్లో సమగ్ర మార్పులతోపాటు, నాడు-నేడు మొదటి, రెండదశల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖల్లో మార్పులు వచ్చాయి. అమ్మఒడితో ప్రభుత్వ బడుల్లో చేరేవారి సంఖ్య పెరిగింది. గతేడాది 30వేల మంది ప్రభుత్వ బడుల్లో ప్రయివేటు పాఠశాల నుండీ చేరారు. ఈ ఏడాది కూడా భారీ విద్యార్థుల ప్రభుత్వ బడుల్లో చేరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఫలితంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమ్మఒడి, నాడు-నేడు, గోరుముద్ద, జనగన్న విద్యాకానుక వంటి పథకాలను అమలు చేస్తోందని సమగ్రశిక్షా అభియాన్‌ పిఒ వెంకటరమణారెడ్డి తెలిపారు. ప్రజాశక్తితో సమగ్రశిక్షా అభియాన్‌ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు.
ప్రజాశక్తి: జగన్న విద్యాకానుక 2022-23 విద్యా సంవత్సరానికి ఎంత మందికి పంపిణీ చేశారు?
పిఒ: జగన్న విద్యకానుక పధకం ద్వారా అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలో చదువుతున్న 3,37,386 మంది విద్యార్థులకు స్కూల్‌బ్యాగ్‌, మూడు జతల యూనిఫామ్‌, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌ బెట్టు, నోటు పుస్తకాలు, డిక్షనరీ, పాఠ్యపుస్తకాలతో వర్క్‌బుక్స్‌ ఉచితంగా అందించడం జరిగింది.
ప్రజాశక్తి : నాడు- నేడు కార్యక్రమం జిల్లాలో ఎలా జరగుతోంది?
పిఒ: మనబడి నాడు- నేడు పధకం ద్వారా మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 1,533 పాఠశాలలో సుమారు రూ.354 కోట్ల అంచనాతో పనులు చేపట్టి పూర్తి చేశాం. మొదటి విడత నాబార్డు నిధులతో 57 పాఠశాలల్లో పనులు చేపట్టాం.
ప్రజాశక్తి: నాడు- నేడు పధకంలో ఎలాంటి పనులు చేపట్టవచ్చు...?
పిఒ: నాడు-నేడు కింద నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, ప్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, పిల్లలు, ఉపాధ్యాయులు తరగతి గదులకు పర్నీచర్‌ ఏర్పాటు, పాఠశాల భవనాలు ప్రహరీ గోడకు రంగులు, మేజర్‌, మైనర్‌ మరమ్మతులు చేపట్టవచ్చు. గ్రీన్‌గ్లోస్సీ చాక్‌బోర్డ్సు ఏర్పాటు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌, ప్రహారీ గోడల నిర్మాణం, వంట గదుల నిర్మాణం, రిపేర్లు, తరగతి గదులు నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల రిపేర్లు, ఆట వస్తువుల కోనుగోలు చేపట్టవచ్చు.
ప్రజాశక్తి: రెండో విడతలో ఎన్ని పాఠశాలలు ఎంపిక చేశారు...?
పిఒ: నాడు-నేడు కింద చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,343 ఎంపిక చేయడం జరిగింది. రూ.39,988.5కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో 269 పాఠశాలల్లో రూ.8.446.5 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
ప్రజాశక్తి: ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఎలా జరుగుతోంది...?
పిఒ: జిల్లాలో 4,828 పాఠశాల విద్యార్థుల 45,10,469 పాఠ్యపుస్తకాలు అవసరమని గుర్తించాం. ఇప్పటి వరకు 17,63,950 పుస్తకాలు మండల పాయింట్లకు పంపిణీచేసి పాఠశాలలకు అందించాం. ఇంకా 2,746,519 పాఠ్యపుస్తకాలు ప్రింటర్స్‌ నుండీ రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే పాఠశాలలకు పంపిణీ చేయడం జరుగుతుంది.