ప్రజాశక్తి-రాయదుర్గం రాష్ట్ర, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు రాయదుర్గం మండలం 74-ఉడేగోళంలోని మద్దానేశ్వరస్వామి కల్యాణమండపం నందు శనివారం ఉదయం మహిళా సాధికారత సదస్సు జరగనున్నట్లు జిల్లా ఎస్‌పి డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. శుక్రవారం ఆయన మద్దానేశ్వరస్వామి సముదాయ భవనం, రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం జరగనున్న సదస్సులో రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ ఎవి.శేష సాయి, జస్టిస్ రమేష్, జస్టిస్ శ్యామసుందర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఈ సదస్సులో బాల్య వివాహ నిరోధక చట్టం, విద్యా హక్కు చట్టం, మహిళా సాధికారతపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అంతేకాక జిల్లాలో నెలకొన్న జోగిని సమస్య పట్ల కూడా అవగాహన కల్పిస్తారన్నారు. 39 మంది జోగినిలకు శాశ్వత భూహక్కు పథకం కింద పట్టాలను పంపిణీ చేస్తారన్నారు. ఆర్డీటీ సంస్థ సహకారంతో ఒక్కో గృహానికి రూ.3 లక్షలు చొప్పున 39 మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.1.20 కోట్ల మెగా చెక్కును ఈ సదస్సులో విడుదల చేస్తారని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రదర్శన స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారన్నారు. జస్టిస్ రమేష్ రాయదుర్గం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అయినందున పూర్వ విద్యార్థుల సహకారంతో గురువులకు సన్మానం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జరుగుతుందన్నారు. జిల్లాలోని పోలీసు, న్యాయ, రెవెన్యూ శాఖల సంయుక్త పర్యవేక్షణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. మహిళలు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని, చట్టాల పట్ల అవగాహన కలిగివుండాలని ఎస్పీ కోరారు.










