Apr 21,2023 22:20

రంజాన్‌ ప్రార్థన

       అనంతపురం : ముస్లిములు నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలు ముగిశాయి. శుక్రవారం రాత్రి నెలవంక కన్పించడంతో శనివారం నాడు ఈద్‌ ఉల్‌ ఫితర్‌ (రంజాన్‌) పండుగ నిర్వహించుకునేలా మత పెద్దలు నిర్ణయించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. శనివారం నాడు అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిములు రంజాన్‌ పండుగను సంబరంగా జరుపుకోనున్నారు. రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు ఈద్గాలను ప్రభుత్వం, ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో ఇప్పటికే సిద్ధం చేశారు. ఎండలు అధికంగా ఉన్నందున ఉదయం 9 గంటలలోపు ప్రార్థనలు ముగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనంతపురం నగరంలోని ఈద్గాతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మసీదులు, ఈద్గా మైదానాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ప్రార్థనల అనంతరం మసీదు మౌలానాలు, పెద్దలు పవిత్ర రంజాన్‌ విశిష్టతను తెలియజేస్తారు. ముస్లిం సోదరులకు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.