అనంతపురం కలెక్టరేట్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పరిశీలన యాత్రలో భాగంగా ఆయన పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను టిడిపి అనంతపురం జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవ రెడ్డిలతో కలిసి మంగళవారం నాడు పరిశీలించారు. చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి బస చేయనున్న ఎంవైఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. కర్నూలు, కడప జిల్లా నుంచి బుధవారం రాత్రికి అనంతపురం నగరానికి చేరుకుంటారు. 3వ తేదీన శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తారు. ఉరవకొండ వద్ద ఉన్న సామూహిక బిందు తుంపర సేద్యం ప్రాజెక్టు, అక్కడి నుంచి బిటిపికి ఎత్తిపోతల పథకం, పేరూరు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్వహించే పర్యటనను జయప్రదం చేయడానికి రెండు జిల్లాల టిడిపి నాయకులు ఏర్పాట్లను సిద్ధం చేశారు. స్వాగతం పలుకుతూ దారి పొడువునా బ్యానర్‌లు ఏర్పాట్లు చేశారు. అధినేత చంద్రబాబును స్వాగతం పలికేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులతో భద్రత ఏర్పాట్లపై సమాచారం అందించారు. మూడు రోజులుగా శ్రీసత్యసాయి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బికె.పార్థసారథి, అనంతపురం జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యేలు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు.










